హైదరాబాద్ : రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ( Congress ) పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని పేర్కొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి ( BRS Rangareddy ) జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో సుదీర్ఘ సమీక్షను నంది నగర్లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. మరోవైపు బీజేపీ కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు.

వేయి రూపాయలకు పైగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరనే ఒక ఉదాహరణ అని కేటీఆర్ వెల్లడించారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వలన ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన సిలిండర్ ధర పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన సిలిండర్ ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
సర్లో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించాలి

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రతి ఒక్క యువకుడికి, యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాల న్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కేటీఆర్ సూచించారు.
త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.