హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ గాంధీభవన్‌కు వెళ్తున్న నిరుద్యోగులను సంఘ విద్రోహ శక్తుల్లాగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులు యాత్రలు చేస్తే.. ఇప్పుడు వారిని అరెస్టు చేసే దుర్మార్గానికి ఒడికట్టిందని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇస్తే.. వాటిని తామే భర్తీ చేశామని కాంగ్రెస్ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని.. పర్సంటేజీల పాలన అని దుయ్యబట్టారు. డీఎస్సీ.. అంటే డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీగా మారిందని విమర్శించారు.
ప్రథమ వర్ధంతి చేయాల్సింది జాబ్క్యాలెండర్కు కాదని, రేవంత్ ప్రభుత్వానికి అని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తే.. సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం లేదా పీసీసీ అధ్యక్షుడు పాదయాత్రలు చేయాలి గానీ.. ఏఐసీసీ ఇన్చార్జితో చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.