రంగారెడ్డి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ గ్రామాల్లో.. అధికార కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా గ్లోబల్ సమ్మిట్ చేపట్టిన గ్రామాలైన పంజాగూడ, మీర్ఖాన్పేటలో కాంగ్రెస్ ఓడిపోవడం గమనార్హం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించేందుకు పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించినా ఫలితం లేకుండాపోయింది. పంజాగూడ, బేగరికంచె, మీర్ఖాన్పేటలో బీఆర్ఎస్, బీజేపీలు సత్తా చాటాయి. దీంతో అధికార కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కందుకూరు మండలంలో కాంగ్రెస్‌కు గట్టిదెబ్బ తగిలింది.
తిమ్మపూర్, ముచ్చర్ల, దాసర్లపల్లి, ఆకులమైలారం, కొలన్‌గూడలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. మొత్తం 35గ్రామపంచాయతీలకు 10 గ్రామపంచాయతీలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగతా 25స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ సత్తా చాటాయి. యాచారం మండలంలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. 24గ్రామపంచాయతీలలో కేవలం 10 మాత్రమే అధికార పార్టీ సొంతం చేసుకోగా, మిగతా 14 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా యాచారం మండలంలోని కుర్మిద్ద, నజ్దిక్‌సింగారం, మల్కిజ్‌గూడ, చింతపట్ల, కేసీతండా, అయ్యవారిగూడ, తక్కళ్లపల్లితండాలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది.
కాంగ్రెస్ పార్టీకి రేడియల్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల ఎఫెక్ట్ పడింది. కడ్తాల్, ఆమనగల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో రైతులు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ఫార్మా బాధిత గ్రామాలైన కుర్మిద్దలో బీఆర్ఎస్ గెలువగా, తాటిపర్తిలో బీజేపీ విజయం సాధించింది. కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ గ్రామాల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంS చర్చనీయాంశంగా మారింది. కందుకూరు మండలంలోని బేగరికంచెలో బీఆర్ఎస్ బలపరిచిన వర్ద్యావత్ వెంకటేశ్‌నాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన జర్పుల రూప్లాను 118 ఓట్ల మెజార్టీతో ఓడించారు. వెంకటేశ్‌కు 320 ఓట్లు రాగా, రూప్లాకు 202 ఓట్లే వచ్చాయి, మీర్ఖాన్పేట్లోనూ బీఆర్ఎస్ మద్దతుదారు నరేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉన్నది.