హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కళ్లెం వేసింది. తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్)లో రేవంత్‌రెడ్డి సర్కార్ ఘోరంగా వెనుకబడింది. నిధుల కేటాయింపులో సంక్షేమ పథకాలకు, సాధారణ ఖర్చులకు ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్ర శాశ్వత అభివృద్ధికి ఇవ్వడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చించించింది. కేసీఆర్ హయాంలో మూలధన వ్యయం కింద మొత్తం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అంటే ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సగటున రూ.45 వేల కోట్లు వెచ్చించారు. కానీ, గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.36 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేసీఆర్ హయాంలో ఖర్చు చేసిన సగటు మూలధన వ్యయం కంటే ఇది చాలా తకువ. గతంతో పోలిస్తే వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణం దాదాపు రూ.20 వేల కోట్లు పెరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మూలధన వ్యయానికి ఆ స్థాయిలో కేటాయింపులు పెంచలేదు. మౌలిక సదుపాయాల కల్పనకు కాస్తో కూస్తో కేటాయింపులు జరుపుతున్నప్పటికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే ఖర్చు భారీగా తగ్గుతూ వస్తున్నది.
భవిష్యత్తుకు భరోసా ఇవ్వని బడ్జెట్
వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయానికి కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో రూ.47,267 కోట్లు ప్రతిపాదించినప్పటికీ అందులో వాస్తవంగా ఎంత మేర ఖర్చు చేస్తారనేది ప్రశ్నార్థకమే. 2024-25లో కేవలం రూ.36 వేల కోట్లతోనే సరిపెట్టడాన్ని చూస్తుంటే ప్రభుత్వం రోజువారీ నిర్వహణ, ఉచిత పథకాలకే పెద్దపీట వస్తున్నదని, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను విస్మరిస్తున్నదని స్పష్టమవుతున్నది. ఆదాయ వనరులు తగ్గడం వల్ల ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధుల్లో కోత విధిస్తున్నదని, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ప్రగతి చక్రం మరింత నెమ్మదించే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భరోసానివ్వని బడ్జెట్
రాష్ట్ర వార్షిక బడ్జెట్ పేద, మధ్యతరగతివారికి భరోసానివ్వలేదు. అంకెల గారడీతో తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించారు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు సమాధి కట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాం. కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండున్నరేండ్లు గడిచినప్పటికీ పట్టణాల అభివృద్ధికి గ్రాంట్స్ లేవు. మాయమాటలు, మోసపూరిత ప్రసంగాలతో ప్రజలను ఇంకెంత కాలం నమ్మిస్తారు?
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
హామీల అమలుకు కేటాయింపులేవి?
తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినప్పటికీ వాటి అమలుకు కార్యాచరణ లేకపోవడం బాధాకరం. రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్లు వంటి వాగ్దానాలు చేసి, బడ్జెట్లో వాటి అమలుకు నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ అనైతిక పాలనకు అద్దం పడుతున్నది. తెలంగాణ ప్రజలు మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారు.
– తాతా మధు, ఎమ్మెల్సీ