హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): టికెట్లు కేటాయించకుండా బీసీలను దారుణంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందేనని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలపై కాంగ్రెస్ తీరును నిరసిస్తూ శనివారం సంఘం కార్యాలయంలో నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా, రాహుల్‌గాంధీ అగ్రవర్ణాల వారిని, దొరలను మాత్రమే దగ్గరికి పిలిపించుకుంటూ వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు ఏఐసీసీ, సీడబ్ల్యూసీ, పీసీసీ, డీసీసీ కమిటీల్లో ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీసీలకు పాతబస్తీలోని ఓడిపోయే స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని, లేదంటే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్, పూసల సంఘం నాయకులు సత్యనారాయణ, లక్ష్మయ్య, భాసర్యాదవ్, భిక్షపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.