హనుమకొండ, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అసలు కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఉపఎన్నిక వస్తే కడియంకు టికెట్ ఇవ్వొద్దని అన్ని మండలాల అసలు కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసిందా? సింగారపు ఇందిరకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ బతుకుడు కష్టమేనా? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్ఠానం పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కడియం శ్రీహరి.. కాంగ్రెస్ అభ్యర్థి సింగారపు ఇందిరపై గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పునర్జన్మ ఇచ్చిన బీఆర్ఎస్నే కాదని అధికారం కోసం, పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరారు. కడియం శ్రీహరి చేరికను సీఎం రేవంత్‌రెడ్డి సమ్మతించినా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించాయి.
టీడీపీ, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆధిపత్యం, అహంకారంతో విర్రవీగి తమను ఇబ్బందులకు గురిచేసిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఇప్పటికీ రగిలిపోతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ఎప్పుడూ తన వైపునకు తిప్పుకున్నానని కాలర్ ఎగిరేసే కడియం శ్రీహరి తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి కుడితిలో పడ్డ ఎలుక చందంగా గిలగిలా కొట్టుకుంటున్నారని ఆయన సన్నిహితవర్గాలే చెప్తున్నాయి. రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకోవాలని భావించిన ఆయన చివరి మజిలీలో ఫిరాయింపుల కత్తి కడియం రాజకీయ జీవితాన్ని కకావికలం చేస్తున్నదని ఆవేదనకు లోనవుతున్నారు. విదియనాడు కాకపోయినా తదియ నాడైనా ఎన్నిక తప్పదు అన్న వాతావరణం నెలకొనడంతో మునుపెన్నడూ లేని గుబులు కడియం శ్రీహరికి పట్టుకున్నట్టు జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసలు కాంగ్రెస్ నేతలు కడియంకు వ్యతిరేకంగా స్పెషల్ క్యాంపెయిన్నే ప్రారంభించారు. ఇప్పటికే రేవంత్ సర్కార్‌పై అసలు కాంగ్రెస్ మోహరించి ఉన్నది. సైకిల్ కాంగ్రెస్‌పై అవకాశం కోసం ఎదురు చూస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరిపై ఇటీవల అసలు కాంగ్రెస్ వర్గాలు ‘బస్తీమే సవాల్’ అంటున్నాయి.
మంత్రుల మధ్య కుంపటి రాజేసిన కడియం?
జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు మహిళా మంత్రుల మధ్య, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కుంపటి రాజేశారని కడియంపై వారంతా గుర్రుగా ఉన్నారని ప్రచారం సాగుతున్నది. బయటికి తామంతా ఒక్కటే అన్నట్టు కనిపిస్తున్నా ‘కాలంబు రాగానే కడియంను కాటేసి తీరాలే’ అన్నంత కసితో ఉన్నారని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టమవుతున్నది. ఈ దశలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో కడియంకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని అల్టిమేటం జారీ చేశారు.
ఇందిరకు టికెట్ ఇవ్వాల్సిందే..
కడియం శ్రీహరి పార్టీలో చేరినప్పటి నుంచి ఉప ఎన్నికలు రాక తప్పదు.. బద్లా తీర్చుకోక తప్పదు అని కాసుక్కూర్చున్న కాంగ్రెస్ శ్రేణులకు సుప్రీంకోర్టు తాజా ఆదేశం సంజీవనిలా పరిణమించిందనే భావిస్తున్నారు. కడియం కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటి నుంచే పార్టీలో ఉన్న వారిని బయటికి వెళ్లేలా ఇబ్బందులు సృష్టించి, పాత టీడీపీ వర్గాన్ని ప్రోత్సహించారని వారంతా గుర్రుగా ఉన్నది. తాజా పరిణామాలతో కడియం శ్రీహరికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దనే క్యాంపెయిన్‌ను మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీనే నమ్ముకొని 2018, 2023 ఎన్నికల్లో పోటీచేసిన సింగారపు ఇందిరకే ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నది. ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు కాంగ్రెస్ పార్టీని కాపాడిన ఆమెకు టికెట్ ఇవ్వడమే న్యాయమని వారు వాదిస్తున్నారు. మరోవైపు తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి చేరేలా ఇందిర సంకేతాలను చేరవేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా తాను నామినేటేడ్ పదవులను అడగలేదని, ఉప ఎన్నికలో పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.
పదవి తిరుగుడు పువ్వు
కడియం శ్రీహరి 2013లో బీఆర్ఎస్లో చేరారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అయ్యారు. కడియం ఎంపీగా గెలిచినా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ 2015లో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2021లోనూ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ పదవికి కాలపరిమితి ఉన్నా 2023లో తిరిగి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించి బీఆర్ఎస్ గెలిపించింది. ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది. నామినేషన్ దాఖలు చేస్తారనే సమయంలో కడియం ప్లేట్ ఫిరాయించారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. అధికారం కోల్పోయిన వెంటనే కడియం శ్రీహరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొత్తానికి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన కడియం శ్రీహరికి ఉప ఎన్నికల్లో గుణపాఠం తప్పదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతుండటం గమనార్హం.