Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డే అని ముద్దుపెకున్నడట ఒకడు’ అని సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్య.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న వాదనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదలచేసిన పార్టీ మ్యానిఫెస్టో తమ ఎన్నికల ప్రణాళికకు కాపీ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొనటం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనమని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని ‘రేటెంతరెడ్డి’ అని సెటైర్లు వేస్తుంటే.. ఆయన తాజాగా మ్యానిఫెస్టో విషయంలో చేసిన వ్యాఖ్యపై ‘ఇట్లుంటదా… నకల్రెడ్డి’ అని ఆట పట్టిస్తున్నారు. రేవంత్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ‘అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలె అంటరు కానీ, ఈ రేవంత్‌రెడ్డి ఏందో ప్రతీదానికి నా పనితనమే అని అన్నీ తన ఖాతాలో వేసుకుంటడు’ అన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో దాదాపు అన్నింటినీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది. కేసీఆర్ పనితనాన్ని రేవంత్‌రెడ్డి సహిత చౌర్యం చేసి తానే సాధించిన అని చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శన మనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పథకాలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందా?
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఉచిత చేపల పంపిణీ, సంచార పశువైద్యశాలలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్, గురుకులాల్లో సన్నబియ్యం, విదేశీ విద్యానిధి (ఓవర్సీస్ స్కాలర్షిప్స్) ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంతా పొడవు పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. 2004-2014 వరకు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా అమలు చేసిన పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కాపీ కొట్టిందా? లేక గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కేంద్రంతోపాటు, దేశంలోని అనేక రాష్ర్టాలు కాపీ కొట్టాయా? అంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ‘రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.10వేల సాయం చేసే రైతుబంధు స్కీం 2018లో ప్రారంభించిన విషయం రేవంత్‌రెడ్డికి తెలియకపోయినా రాష్ట్రంలోని 6 5లక్షల మంది రైతులకు తెలియదా? ఏకారణంతో రైతు మరణించినా ఆ కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అందజేస్తున్నది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దేశమంతా తెలిసినా రేవంత్‌రెడ్డికి తెలియదునుకోవా లా? తెలిసినా ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న ట్టు వ్యవహరిస్తున్నారా?’అన్న విమర్శలు వస్తున్నాయి.
‘ఉత్తుత్తి’ కాంగ్రెస్.. నోట్ దిస్ పాయింట్
‘ఉత్తుత్తి బ్యాంక్.. ఉత్తుత్తి బ్యాంక్’ అని ఓ సినిమాలో.. లేని బ్యాంకును ఉన్నట్టుగా చూపి హాస్యాన్ని పండించినట్టు.. కాంగ్రెస్ పార్టీ కూడా తాను ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చిన దాఖలాలు లేవు. అంతెందుకు 2004లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. పంజాబ్‌లో ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి రాగానే అక్కడ తూచ్ అన్నది. 2014లో తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయంగా రాహుల్‌గాంధీ ప్రకటించినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మకుండా కేసీఆర్‌కే జై కొట్టడం గమనార్హం.
పథకమెవరిది? కాపీ ఎవరిది?
‘తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తది’ అన్న మాట తొమ్మిదిన్నరేండ్లుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్న అనేక పథకాలను కేంద్రం, పలు రాష్ర్టాలు కాపీ కొట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. బీఆర్ఎస్ పథకాలను హైజాక్ చేయటమే కాకుండా ‘దొంగే దొంగా..దొంగా’ అని అరిచినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉన్నదని బీఆర్ఎస్ మండిపడుతున్నది.
తెలంగాణ పథకం : కేంద్రం కాపీ కొట్టి మార్చిన పేరు
రైతుబంధు : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
మిషన్ భగీరథ : హర్‌ఘర్ జల్
కల్యాణలక్ష్మి : పీఎం షాదీషగన్
మిషన్ కాకతీయ : అమృత్ సరోవరం
జిల్లాకో మెడికల్ కాలేజీ : జిల్లాకో మెడికల్ కాలేజీ
మన ఊరు-మనబడి : పీఎం శ్రీ స్కూల్స్
సంచార పశువైద్యశాల 1962 : సంచార పశువైద్యశాల
బీసీబంధు : విశ్వకర్మ యోజన
ఇతర రాష్ర్టాలు అమలు చేసిన మన పథకాలు
మన పథకం : రాష్ట్రం
మన ఊరు-మన బడి : ఉత్తరప్రదేశ్, సీఎం అభ్యుదయ యోజన
రైతుబంధు : కర్ణాటక (రైతుసిరి పేరుతో)
రైతుబీమా : కర్ణాటక (జీవనజ్యోతి పేరుతో)