Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి పోరాడిన విద్యార్థులకు ఉన్నత పదవులు కట్టబెడుతామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక తన అసలు రంగును బయటపెట్టింది. కార్పొరేషన్ చైర్మన్స్ పదవుల్లో ఏ ఒక్క విద్యార్థి నాయకుడికి కేటాయించకుండా తన మోసపూరిత బుద్ధిని ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ.
మొన్న అసెంబ్లీ ఎన్నికలు.. నిన్న లోక్సభ ఎన్నికలు.. నేడు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు.. వీటిల్లో ఎక్కడా కూడా విద్యార్థి ఉద్యమ నాయకులకు చోటు లభించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్ లభించలేదు. విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మొర పెట్టుకున్నారు. కానీ వారి చర్చలు ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఏ ఒక్క విద్యార్థి నాయకుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి.. అధికారంలోకి వస్తే కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఉంటాయి. వాటిల్లో ఎక్కడో ఒక చోట అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలికారు.
మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్సభ ఎన్నికలు కూడా రానే వచ్చాయి. ఇక ఎంపీ టికెట్ల కోసం విద్యార్థి నాయకులు గట్టిగానే పోరాటం చేశారు. బహిరంగంగానే తమ నిరసనలు వ్యక్తం చేశారు. మళ్లీ అధిష్టానికి మొర పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారి డిమాండ్లను ఆలకించలేదు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి కూడా వారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి ఎంపీ టికెట్లు ఇచ్చారు. ఇలా రెండో సారి విద్యార్థి ఉద్యమ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో పరాభవం ఎదురైంది. కిందమీద పడి 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. ఇక ఆశ అంతా కార్పొరేషన్ చైర్మన్ పదవులపైనే. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు దక్కని విద్యార్థి నాయకులంతా కార్పొరేషన్ చైర్మన్లపై ఆశ పెట్టుకున్నారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను, నిరుద్యోగులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన తమకు చివరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా దక్కుతాయని విద్యార్థి నాయకులు ఊహించారు. కానీ అది కూడా నెరవేరలేదు. విద్యార్థి నాయకులు కలలుగన్న ఆశలు కలగానే మిగిలిపోయాయి.
ఇవాళ పలు కార్పొరేషన్లకు చైర్మన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ 35 మందిలో కూడా ఏ ఒక్కరూ విద్యార్థి నాయకులు లేకపోవడం విశేషం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీల విద్యార్థి నాయకులకు పదవులు వరించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు మరో 15 దాకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఐదారు మంది విద్యార్థి నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఒక్కరికే అవకాశం కల్పిస్తామని పార్టీ అధి నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
గత పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. విద్యార్థి ఉద్యమ నాయకులు, నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థి నాయకులను, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించింది. అధికారం కోసం విద్యార్థి నాయకులను వాడుకొని నేడు కూరలో కరివేపాకులా తీసిపడేసింది. ఉద్యమంలో ముందున్న విద్యార్థి నేతలకు ఎలాంటి పదవులు కట్టబెట్టకుండా.. కనీసం వారిని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. ఇందుకు నిదర్శనం కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపే. అదే కేసీఆర్ ఎంతో మంది విద్యార్థి ఉద్యమ నాయకులను గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు పంపించారు. అంతేకాకుండా ఓ 10 మంది దాకా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టి వారి త్యాగాలకు సమున్నతమైన గౌరవం కల్పించారు. పార్టీలో వివిధ అవకాశాలు కల్పించి విద్యార్థి నాయకులకు పెద్దపీట వేశారు. ఇది నేడు మనందరి కళ్ల ముందున్న నగ్న సత్యం.