హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘చావు భాష’ చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు సుదీర్ఘంగా పోరాడిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మంగళవారం ఓ మీడియా ప్రతినిధితో శంకర్ మాట్లాడుతూ ‘కేసీఆర్ నివాసం వద్ద చావుడప్పు కొట్టడమే కాదు.. ఆయన చావే కోరుతున్నం! అవును.. కేసీఆర్ చావు కోరుకుంటున్నం.
ఈ రాష్ర్టానికి పట్టిన పీడ అతను’ అని నోటి దురుసుతనం ప్రదర్శించడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజమే. కానీ ఒక రాజకీయ ప్రత్యర్థి చావును కోరుకొనే స్థాయికి దిగజారి మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో కేసీఆర్‌పై చావు భాష ఉపయోగించారు. డిగ్రీ లెక్చరర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అం దించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి ‘మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నదని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉన్నదని విర్రవీగితే.. స్ట్రెచర్ మీదికి పంపిన్రు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
మరో కార్యక్రమంలో కేసీఆర్‌ను ఉద్దేశించి ‘నీ చరిత్ర ఇకడే శాశ్వతంగా సమాధి అయిపోతుంది’ అని అనడంపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. సీఎం బాటలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు దిగజారి మాట్లాడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్య మైతే ఎన్నికల్లో ఓడించాలి. ఆయన పాలనను ప్రశ్నించాలంటే ప్రజల ముందే ప్రశ్నించాలి. కానీ చావు కోరుకోవడం రాజకీయ పోరాటానికి ప్రమాణమా? అనే ప్రశ్నకు కాంగ్రెస్ నాయకత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది. కాంగ్రెస్ నేతల చావుభాషపై కేసీఆర్ కూడా గతంలో ఘాటుగా స్పందించారు. ‘పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నడు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.. నా కొడుకా అనుకుంటున్నవేమో’ సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు.