హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చిన సీట్లను చూసి బీజేపీ బలుపు అనుకుంటున్నదని, కానీ అది వాపు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీకి ఏవిధంగా బుద్ధి చెప్పారో, ఆ విషయంపై మాట్లాడరెందుకని నిలదీశారు. ప్రస్తుతం బీజేపీకి పెరిగిన ఓటింగ్ శాతం శాశ్వతం కాదని అన్నారు. మహబూబ్‌నగర్‌లో తమ అభ్యర్థి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారని చెప్పారు. తమ పాలనను ప్రజల హర్షించడం వల్లనే కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీ 8 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీ గొప్ప కాదని, బీఆర్ఎస్ పెట్టిన భిక్ష అని విమర్శించారు.