Makkan Singh Raj Thakur | పెద్దపల్లి, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ పోలీసు అధికారిపై ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ కోసం 600 ఎకరాల భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణను మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతినగర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఆయన అనుచరులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ప్రజాభిప్రాయ సేకరణ వీఐపీ గేట్ వద్ద కు ఎమ్మెల్యే తన కాన్వాయ్‌తో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అక్కడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న ఎమ్మెల్యేకు నమస్తే చెప్పి లోపలికి అందరినీ అనుమతించడం లేదని, ఒక్కరే వెళ్లాలని సూచించారు.
ఆగ్రహించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఏసీపీపై తిరగబడ్డారు. ‘నా వాహనాన్ని ఆపిందెవడు..?’ అంటూ ట్రాఫిక్ ఏసీపీపై మకాన్సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ రాజ్యం అంటూ ఆయన అనుచరులు ఏసీపీపై దాడికి ప్రయత్నించారు. దీంతో నా డ్యూటీ నేను చేస్తున్నా. ఏం చేస్తారు..? మహా అంటే బదిలీ చేస్తారు. అంతేగా నేను మాత్రం మీకు గౌరవమిస్తున్నాను. మీరు మాత్రం అలా మాట్లాడుతున్నారు అంటూ తేల్చి సమాధానం చెప్పారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. కాంగ్రెస్ నేతల దురుసు ప్రవర్తనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విధుల్లో ఉన్న అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం సరికాదని మండిపడుతున్నారు.
ప్రజల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాకే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రామగుండం బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో 780 మంది పోలీసుల పహరా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కార్యక్రమం ప్రారంభానికి ముందే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను అరెస్టు చేసి, మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను నిర్బంధించారు.