హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 1న ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్టు డబ్బా కొట్టింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోలేదని మంత్రులు దుష్ప్రచారం చేశారు. ఏమాత్రం ఆలోచించేవారికైనా ఈ వాదనలో పసలేదని ఇట్టే తెలిసిపోతుంది.
ఉమ్మడి ప్రభుత్వం 2003, ఆగస్టు 5న ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కంచె గచ్చిబౌలి భూములను కట్టబెట్టగా ఆ తర్వాత రద్దు చేయడంతో 2006 నుంచి కోర్టు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో 2024, మార్చి 7న హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఈ తీర్పు తమ విజయమని కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకుంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్ 7న ఏర్పడిన సంగతి తెలిసిందే. అంటే 20 ఏండ్లుగా కొనసాగుతున్న కేసుపై కేవలం మూడు నెలల్లోనే బలమైన వాదనలు వినిపించి తుది తీర్పును సాధించిందా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల్లోనే ఇరుపక్షాల వాదనలన్నీ పూర్తయి, ధర్మాసనం తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం చెప్పగలదా? అని నిలదీస్తున్నారు.
ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి కృషి చేయకపోతే.. నిపుణులైన న్యాయవాదులను నియమించి బలమైన వాదనలు వినిపించకపోయి ఉంటే కేసు ఎప్పుడో ముగిసిపోయి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చి ఉండేదని, ఆ భూములు ఎప్పుడో అన్యాక్రాంతమై ఉండేవని విశ్లేషకులు చెప్తున్నారు. అలాకాకుండా 2024 వరకు కేసు నిలబడిందంటే పదేండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నట్టే కదా? అని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే 2014 సెప్టెంబర్లో ఇంప్లీడ్ అయింది. 2017లో టీజీఐఐసీని కూడా ఇంప్లీడ్ చేయించిందని గుర్తుచేస్తున్నారు.
ఇలా ఈ కేసులో అనుకూలమైన అన్ని మార్గాల్లో గట్టి ప్రయత్నాలు చేసి, బలమైన వాదనలు వినిపించడం వల్లే కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని స్పష్టంచేస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఢిల్లీలో వెల్లడించారని తెలిపారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అవి హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములని, అక్కడ అరుదైన జంతు, వృక్ష జాతులు నివసిస్తున్నాయన్న కారణంతో ఆ భూములను కాపాడిందని ఈటల స్పష్టంచేశారు.