మహబూబ్నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు (Blackmail Politics) పాల్పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలో మూడో విడతలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. ప్రచారం చివరి రోజైన సోమవారం అచ్చంపేట మండలంలోని గుంపన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా తాము (కాంగ్రెస్) బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయాలని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న వీడియో జిల్లాలో వైరల్గా మారింది.
తమ అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తేనే గ్రామానికి మంజూరైన 11 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని.. ఒకవేళ తమ అభ్యర్థి ఓడిపోతే వాటిని రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇతర పార్టీ అభ్యర్థులకు ఓట్లేస్తే అభివృద్ధి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. గతంలోనూ చాలామందికి ఇండ్లు రద్దయ్యాయని కొందరు.. ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నేత దృష్టికి తీసుకెళ్తే తమకు ఓట్లేస్తేనే పథకాలు ఇస్తామని, లేకుంటే బంద్ చేస్తామని పేర్కొన్నారు.