బజార్హత్నూర్, ఏప్రిల్ 11 : ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆడే గజేంధర్తోపాటు నాయకులను దేగామ గ్రామంలోని పాత కాలనీవాసులైన ముంపుబాధితులు అడ్డుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలోని చెరువు నిండి ఇండ్లల్లోకి వరద చేరుతున్నదని తెలిపారు. మురుగునీరు, దుర్వాసన, పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు తమకు వద్దని, ముంపు సమస్య పరిష్కరించి 130 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.