Farmers | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 18: ‘వ్యవసాయానికి 3 గంటలే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ మాకొద్దు.. 24 గంటల విద్యుత్తుతో ఏటా మూడు పంటలే మాకు ముద్దు’ అని ఆన్నదాతలు నినదించారు. కాంగ్రెస్ అంటేనే దశాబ్దాలుగా కరెంటు కోతలు, వాతలేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను మునుపటిలా చీకట్లోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీనే అంధకారంలోకి నెట్టేస్తమని రెండోరోజైన మంగళవారం రైతు సభల్లో అన్నదాతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అందులో కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, మళ్లీ అప్పటి కటిక చీకటి రోజులు గుర్తుకు తేవొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ, 3 పంటలకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తీర్మానాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కొండన్నగూడలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు సభలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్ నేతల దుర్మార్గపు ఆలోచనలను రైతులకు వివరించారు.
కాంగ్రెస్ అంధకారపు రోజులు కావాలా? రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా! తెలుసుకోవాలని రైతులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలో పలు రైతు వేదికల వద్ద సమావేశాలకు రైతాంగం స్వచ్ఛందంగా కదిలివచ్చింది. పూడూర్ మండలం చన్గొముల్ రైతు వేదిక సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్ మండలంలో రైతు వేదిక వద్ద సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రైతులు తీర్మానాలు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలోని రైతు వేదిక వద్ద సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. హుజూరాబాద్ రైతు వేదిక వద్ద సభకు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. గంగాధర మండలం కురిక్యాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల రూరల్ మండలం కల్లెడ రైతువేదికలో సభలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పెద్దపల్లి జిల్లా రైతు సమావేశాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా సింగారంలోని రైతు వేదికలో సభకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు.
భూ కబ్జాలే… రేవంత్ చరిత్ర: పోచారం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చరిత్ర చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఆక్రమించడం, అడిగితే దాడులు చేయించడమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్ దౌర్జన్యాలతో కొంత మంది పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మూడు గంటలు కరెంట్ అని మాట్లాడిన పీసీసీ చీఫ్.. తన తప్పును ఒప్పుకోకుండా రోజూ రైతుల కోసం పని చేసే ప్రభుత్వాన్ని, నాయకులను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్, మోస్రాలోని రైతు వేదికల వద్ద రైతే రాజు పేరిట అన్నదాతలతో సమావేశాలు నిర్వహించారు. పూటకో మాట, రోజుకో వేషం వేస్తూ పిచ్చి నాటకాలు వేస్తే ప్రజలు తరిమి కొడతారని రేవంత్‌ను హెచ్చరించారు. వ్యవసాయం చేయడానికి కాంగ్రెస్ ఇస్తామన్న 3 గంటలు సరిపోతుందా? అంటూ రైతులను ప్రశ్నించగా, సరిపోదంటూ బదులిచ్చారు. ఎకరాకు గంట కరెంట్ ఇస్తే చాలంటూ వ్యవసాయం గురించి తెలియని రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎకరంలో వరి పంట పండాలంటే 60 లక్షల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని చెప్పారు. అంటే రోజుకు సరాసరి యాభై వేల లీటర్ల నీరు అవసరమని గణాంకాలతో వివరించారు. ఎకరాకు గంట కరెంట్‌తో యాభై వేల లీటర్ల నీళ్లు పారించగలమా? అని ప్రశ్నించారు. సాగుకు నిరంతర ఉచిత కరెంట్ సరఫరాతో రైతులకు కేసీఆర్ ధైర్యంగా నిలిచారని చెప్పారు. 2014లో తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,700 మెగావాట్లు కాగా, డిమాండ్ 14,000 మెగావాట్లు ఉండే దని చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీర్చాలనే సం కల్పంతో సీఎం కేసీఆర్ దూరదృష్టితో 11 వేల మెగావాట్ల ప్లాంట్లను నిర్మించారని తెలిపా రు. ఇప్పుడు రాష్ట్రంలో 18,870 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.
దగుల్బాజి రేవంత్..: ఎర్రబెల్లి
కరెంట్‌పై చవకబారు వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ను రైతులు తన్ని తరిమికొట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తిలో, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతు సభల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దగుల్బాజి రేవంత్.. కుట్రబాజి కాంగ్రెస్ అని, అది రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. రేవంత్ ఓ బ్రోకర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ, బ్రోకర్ రేవంత్ మాటలను తిప్పికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో క్రాప్, పవర్ హాలిడేలు ప్రకటించలేదా? అని ప్రశ్నించారు. రైతులను విస్మరిస్తే కాంగ్రెస్‌కు సమాధి తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్‌గాంధీ మాటలు హాస్యాస్పదమని మండిపడ్డారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: ఇంద్రకరణ్‌రెడ్డి
అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. నిర్మల్ మండలం ఎల్లపల్లి రైతు వేదికలో మంత్రి మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యాలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొన్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు, రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ర్టానికి, రైతులకు నష్టం కలిగించే కాంగ్రెస్ కావాలో.. రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.
బ్లాక్ మెయిలర్ రేవంత్: మల్లారెడ్డి
రైతు ద్రోహి, బ్లాక్ మెయిలర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రైతులు, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లాల్‌గడి మలక్‌పేట రైతు వేదికలో మలారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అన్న రేవంత్‌కు రైతుల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆరోపించారు. రైతులను చూలకన చేసి మాట్లాడిన వ్యాఖ్యలకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసేలా ప్రజలు, రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. ‘పవర్’ కట్ ఖాయం: పువ్వాడ
తప్పిదారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మొదట చేసేది విద్యుత్తు కోత విధించడమేనని, అన్నదాతల జీవితాలను ఆగం చేసేలా మాట్లాడిన రేవంత్‌ను తరిమికొట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలోని రైతు వేదికలో పువ్వాడ మాట్లాడుతూ.. రేవంత్ మాటలు కచ్చితంగా రైతులను హేళన చేసేలా ఉన్నాయని, ఆయనకు మతిభ్రమించిందని మండిపడ్డారు. రైతులను కష్టపెట్టిన వారు బాగుపడినట్టు చరిత్రలోనే లేదని చెప్పారు.