గజ్వేల్, ఆగస్టు 3: రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. ఆదివారం మూట్రాజ్‌పల్లి సమీపంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో రేషన్‌కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ వేదికపై ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కూర్చోవడంతో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. వేదికపైకి తూంకుంట నర్సారెడ్డిని పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఏమి జరుగుతుందో తెలియక కొంతమంది లబ్ధిదారులు బయటకువెళ్లారు.
వేదికపైనే ఉన్న మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఇది పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమం అని, ఈ పద్ధతి బాగాలేదంటూ ఆందోళనకు దిగిన వారిని హెచ్చరించారు. వేదిక మీద ఉన్న ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిని నచ్చజెప్పి అధికారులు, పోలీసులు కిందకు పంపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించారు. గొడవ జరుగుతున్న సమయంలో వేదికపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్లు, ఏసీపీ ఉన్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో మరోవర్గం నాయకులు ఆందోళనకు దిగారు.