హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వారు అధికార పార్టీలోని ఓ ముఖ్యనేతకు సామంతులు. ఆయనకు నీడలా వెన్నంటే ఉంటూ, ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటారనే పేరున్నది. ఇప్పుడు వారికి అధికారిక పదవులేవీ లేకపోయినా.. ముఖ్యనేతకు చెందిన శాఖల్లో షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొన్నటివరకు ముఖ్యనేత కార్యాలయమే వారికి అడ్డా కాగా, ఇప్పుడు జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ అత్యున్నతాధికారి కార్యాలయంలో కూర్చొని అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, విద్యాశాఖల్లో ఏ ఫైల్ కదలాలన్నా సదరు షాడో మంత్రులను ప్రసన్నం చేసుకోవాలనే చర్చ జరుగుతున్నది. సదరు నేత అనుయాయుల ఒత్తిడిని ఆయా శాఖల అధికారులు సైతం తట్టుకోలేకపోతున్నారని చర్చసాగుతున్నది. గడిచిన 18 నెలల వ్యవధిలో వారు రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అందాల పోటీలతో వార్తల్లోకి ఎక్కిన ముఖ్యనేత అనుచరుడు షాడో మంత్రిగా చక్రం తిప్పుతున్నట్టు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర విభాగాల్లో ఏ చిన్న పని కావాలన్నా, ఆయన ఆమోదించాల్సిందేనని ప్రచారం సాగుతున్నది. లేఅవుట్లు, డీటీసీపీ, భవన నిర్మాణ అనుమతులు, రెరా అనుమతులు ఇలా ఏవీ కావాలన్నా సదరు షాడో మంత్రిని సంప్రదించాల్సి వస్తున్నదని అధికార పార్టీ నేతలే వాపోతున్నారట.
తన సామాజికవర్గానికే చెందిన కీలక అధికారికి పోస్టింగ్ ఇప్పించుకొని, ఆయన ద్వారా వ్యవహారాలు చక్కదిద్దుతున్నట్టు హెచ్ఎండీఏ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కీలక శాఖలకు అధిపతులుగా తమ వారికే పోస్టింగులు ఇప్పించి, వారితో అక్రమ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతించినా, ఎస్ఎఫ్టీల ఆధారంగా ఒక ధర ఫిక్స్చేసి రూ.కోట్లలో వసూలు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలే చెప్తున్నాయి.
షాడో మంత్రి ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించిపోతున్నాయని, పార్టీ నాయకులు, రియల్టర్లు, బిజినెస్మెన్లు ఇలా ఎవరికి ఏ అవసరం ఉన్నా రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని ఆయా శాఖల అధికారులు చెప్పుకుంటున్నారు. ఈ వసూళ్ల వ్యవహారంపై ఇటీవల ఆ పార్టీ అధినాయకత్వానికి కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేయడం గమనార్హం.
హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత విద్యాశాఖను గుత్తపట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. విద్యాశాఖలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఎవరు బదిలీ కావాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితి ఉన్నదని విద్యాశాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రైవేటు కళాశాలలకు, ఇంజినీరింగ్ కళాశాలకు అనుమతులు కావాలంటే.. షాడోమంత్రిగా మారిన ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ప్రచారం జరుగుతున్నది.
ఒకవేళ ఆయన ససేమిరా అంటే అత్యుతన్న స్థాయిలో ప్రయత్నించినా ఫలితం లేదన్నది ఆ ప్రచారం సారాంశం. రాష్ట్రంలో ఇటీవల ఐదు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు వార్తలు వెలువడ్డాయి. అలా ఏకకాలంలో ఐదు వర్సిటీలకు ప్రతిపాదనలు పంపడంలోనూ సదరు నేత జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారినట్టు విద్యాశాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.