హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న రీతిలో రెండేండ్లుగా హామీలను అమలు చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గత మూడు రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నోట్ల కట్టలను పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికారం ఉంది కదా.. అని ఇష్టానుసారంగా డబ్బుల ప్రవాహాన్ని పారించి ఓట్లు దండుకోవాలనుకున్న హస్తం పార్టీ నేతలకు ఇప్పుడు అదే ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఇప్పుడిచ్చిన డబ్బులు పాత బాకీ కింద జమ చేసుకుని, ‘మిగిలిన బాకీ ఎన్నడిస్తరు’ అని ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తుండటం కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నది. నోట్లతో ఓట్లు కొల్లగొడదామనుకుంటే.. ఓటర్లు తమ కంటే తెలివితో వ్యవహరిస్తున్నారంటూ తలలు పట్టుకుంటున్నారు.
సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు రాజకీయ పార్టీలే పాచికలు వేసి వ్యూహాలను అమలు చేయడం చూశాం. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులే తేల్చి చెప్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి విజయంపై భరోసా లేక నానా తంటాలు పడుతున్నది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు హైదరాబాద్ మహా నగరంలోనే హస్తం పార్టీకి ప్రాతినిథ్యం కరువైంది. ఇదే క్రమంలో జూబ్లీ ఉప ఎన్నికలోనూ గెలుపు అంత సులువు కాదని గుర్తించడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలల కిందటే ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపారు. కేవలం శంకుస్థాపనలతో శిలాఫలకాలు వేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని సీఎం ప్రచారం చేసుకుంటున్నారు.
కానీ నేటికీ నియోజకవర్గంలోని అనేక బస్తీల్లో కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను సైతం పూడ్చే దిక్కులేదు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను ఎత్తే నాథుడు లేడు. అయినా మూడు నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేశారు. చివరకు సీఎం రేవంత్‌రెడ్డి సైతం మునుపెన్నడూ ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నిక కోసం చేయని రీతిలో ప్రచారం చేయాల్సి వచ్చింది. అయినా ఓటర్లలో స్పందన కరువైందని అనేక సర్వేల్లో నివేదికలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ నేతల్లో వర్గపోరుతో సుమారు 15 రోజులపాటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడింది. 10 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని, కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సుమారు 15 శాతం ఆధిక్యం ఉన్నదని ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చేపట్టిన సర్వేలోనే తేలింది. ముఖ్యంగా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారారని నివేదికలు తేల్చడంతో హడావుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి, బాబాయ్‌పై రౌడీషీటర్ ఉన్నందున బైండోవర్ చేసిన అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం.. రౌడీలంటే మంచోళ్లు, సెటిల్మెంట్లు చేస్తారని నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నిక ‘చే’జారిపోవడం ఖాయమని తేలడంతో చివరకు డబ్బుల ప్రవాహంతో గట్టెక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసిన బాకీ కార్డు ఓటర్లలో పెద్ద ఎత్తున చైతన్యాన్ని నింపింది. ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత రెండేండ్లుగా ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా వాటిని అమలు చేయనేలేదు. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీని గత 23 నెలలుగా అమలు చేస్తే అప్పట్లో ఓటేసిన ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేది. ఉదాహరణకు.. ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికి సీఎం రేవంత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రూ.12 వేల ఆర్థికసాయం కింద ఇంటి పెద్దకు రూ.24 వేలు రావాలి.
ఆయన భార్యకు మహిళలకు ఇవ్వాల్సిన రూ.2,500 కింద రూ.57,500 రావాలి. అంటే ఆ ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు రూ.81,500 ఆర్థిక ప్రయోజనం చేకూరాలి. కానీ వాటిని ఇవ్వకపోగా ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో మళ్లీ ఓటు అడుగుతున్నారు. ఇందుకు గత మూడు రోజులుగా ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అంటే ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.10 వేల ఇచ్చినా ఇంకా కాంగ్రెస్ పార్టీ 71,500 బాకీ పడిందన్నమాట.
జూబ్లీహిల్స్ పరిధిలో గత 3 రోజులుగా కాంగ్రెస్ భారీ ఎత్తున డబ్బును పంపిణీ చేస్తున్నది. ఆ పార్టీ నేతలు స్వయంగా ఓటర్లకు నోట్లు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా బయటికొచ్చాయి. ఈ విషయంలో అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించాయి. కానీ ఇక్కడే జూబ్లీహిల్స్ ఓటర్లు తమ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఈవీఎంలో బటన్ నొక్కకుండానే అధికార కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.5,000.. కొన్నిచోట్ల ఏకంగా రూ.8,000 ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మూడు రోజుల కిందట కార్పొరేటర్ సీఎన్ రెడ్డి నివాసంలో మంత్రుల సమక్షంలో డివిజన్ ఇన్చార్జులకు పంపిణీ అయిన నోట్ల కట్టలు గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని బస్తీల్లో స్వైరవిహారం చేసిన వీడియోలు బయటికొచ్చాయి. వాస్తవానికి ఓటుకు నోటు తీసుకున్న వాళ్లలో నూటికి 70 శాతమైనా ఓట్లు వేస్తారని కాంగ్రెస్ ఆశించింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు బాకీ ఉన్నదని ఓటర్లు నొక్కి చెప్పడంతో తీసుకున్న నోటుకు ఓటు వేయాలనే షరతుగానీ నిజాయితీ కానీ ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఓటర్లే స్వయంగా చెప్తున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన నోట్లను తీసుకున్నప్పటికీ ఈ నెల 11న జరిగే పోలింగ్‌లో తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉన్నదని ముక్తకంఠంతో ఓటర్లు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తే విజయం తమదేనని భావించిన కాంగ్రెస్ శిబిరంలో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసాలను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ బాకీ కార్డుతో డబ్బు పంపిణీ బూమరాంగ్ అయినట్టేనని తేలింది.