పెద్దపల్లి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ (Congress) నాయకులు బరితెగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై గెలిచిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం సర్పంచ్ అంగోత్ రవికుమార్నాయక్పై దాడులకు తెగబడ్డారు. రామగుండం నియోజకవర్గం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీట్ల శంకర్రెడ్డి సర్పంచ్ స్థానానికి పోటీకి దిగాడు. ఆయనపై రవికుమార్నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చనే ఉద్దేశంతో సోమవారం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరాడు. రవికుమార్ వార్డుసభ్యులతో కలిసి ఓటర్లను కలుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకుసాగాడు.
ఈ క్రమంలో రాత్రి 7.30 గంటల సమయంలో కాంగ్రెస్ నాయకుడు గీట్ల శంకర్రెడ్డి, ఆయన తనయుడు, అనుచరులు రవికుమార్నాయక్తో పాటు వార్డుసభ్యుడు అనిల్రెడ్డిపై మారణాయుధాలతో దాడులకు దిగారు. జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడటంపై గ్రామస్తులు ఆగ్రహించారు. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ధర్నాకు దిగారు. ఎస్ఐ వెంకట్ చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పినా వినలేదు. తర్వాత అంతర్గాం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేశారు. ఈ మేరకు రవికుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. తన గెలుపును జీర్ణించుకోలేక, ఎస్టీ అనే చిన్న చూపుతో తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తమకు న్యాయం చేస్తామని, దాడికి పాల్పడినవారిని అరెస్టు చేస్తామని చెప్పారని పేర్కొన్నారు.