చెన్నారావుపేట, డిసెంబర్ 16 : వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ మారుమూలన ఉన్న చిన్నతండాలో అధికార మదంతో కాంగ్రెస్ (Congress) గూండాలు చెలరేగిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ గూండాలు అరాచకం చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. చెరువుకొమ్ముతండా చివరన ఉన్న దుర్గమ్మ గుడి వద్ద సోమవారం అర్ధరాత్రి పథకం ప్రకారం కాంగ్రెస్ గూండాలు చలి మంటలు వేశారు. అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను చూసి తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టారు.
మాది అధికార పార్టీ.. బీఆర్ఎస్ సర్పంచ్ ఎలా గెలుస్తాడో చూస్తాం..తెల్లారిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలను ఒక్కడిని కూడా వదలం’ అంటూ హెచ్చరించారు. దీంతో ఎదురు తిరిగిన బోడ వెంకన్న, రెడ్యా, శ్రీను, శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా నిప్పుల కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళలనూ కర్రలతో కొట్టినట్టు స్థానికులు తెలిపారు. రెడ్యాకు తీవ్రగాయాలవగా నర్సంపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. బోడ వెంకన్నకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనిపరిస్థితిని అదుపు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ గూండాల దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రతి దాడులు చేస్తే అధికార నాయకులు తట్టుకోలేరని హెచ్చరించారు.
ఎన్నికల ఏర్పాట్లపై పీవోల ఆగ్రహం
అలంపూర్ చౌరస్తా, భీమారం, మహదేవపూర్/కాటారం: డిసెంబర్ 16: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు సరిగా లేక అధికారులపై పీవోలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిషత్ ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీ గందర గోళంగా మారింది. బూత్‌లకు వెళ్లేందుకు పీవోలు ఎదురుచూసినా అధికా రులు పట్టించుకోలేదు. సామగ్రిని బస్సులో చేర్చేందుకు సిబ్బందిని నియ మించలేదని, మహిళలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం జడ్పీ పాఠశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లపై పీవో శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్ తగ్గించారని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పాఠశాల ఆవరణ, కాటారం బీఎల్ఎం గార్డెన్లో సిబ్బంది ఆందోళన చేపట్టారు.
ఓటు వేయలేదనే కక్షతో బాలింతపై దాడి
శంకరపట్నం, డిసెంబర్ 16 : కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలంలో బాలింతతోపాటు ఆమె సోదరి, తల్లిపై దాడికి దిగారు. పోలీసుల వివరాల ప్రకారం.. మొలంగూర్‌లో ఖమరున్నీసా 8వ వార్డు స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఓటమికి దాసరి మొగిలయ్య, భార్య పద్మ, కూతుళ్లు మౌనిక, ప్రియాంక కారణమని ఆగ్రహం పెంచుకున్నది. తన కుటుంబ సభ్యులు యాస్మిన్, హకీమ్‌తో కలిసి బూతులు తిడుతూ ప్రియాంకను బాలింత అని కూడా చూడకుండా దాడిచేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.