యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని(Congress leaders) ప్రజలు వాపోతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) మల్లాపురం గ్రామంలో గ్రామసభ ఉద్రిక్తతకు దారి తీసింది. అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటించే క్రమంలో గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మంగ సత్యనారాయణతో పాటు ఇతరులు జోక్యం చేసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడారు.
తాగి పైసలు తీసుకొని ఓట్లేసిన మీకు ఎందుకు ఇవ్వాలని మండిపడ్డారు. మా ఇష్టం ఉన్న వాళ్లకు ఇండ్లు ఇస్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండని వాగ్వాదానికి దిగారు. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 నగదు పథకం భూమి ఉన్న వారికి రావడం పై గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కర్ర వెంకటయ్య జోక్యం చేసుకొని ప్రజాపాలన అంటే ఇదేనా? అంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గ్రామాలలో గ్రామసభలను రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమైనట్టు ఆయన స్పష్టం చేశారు.