హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లపై గద్దల్లా వాలుతున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చేవారిని తోడేళ్లలా పీక్కుతింటున్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భూములు కొనుగోలుచేసినవారి నుంచి సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేత ఏకంగా రూ.27కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. వర్గల్, చౌటుప్పల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లోనూ ఇదే తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామికవాడల్లో భూములు కొనుగోలు చేసినవారి నుంచి గజాల చొప్పున ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. టీజీఐఐసీ గతంలో రైతులనుంచి భూములు సేకరించి పారిశ్రామికవాడలను అభివృద్ధిచేసిన విషయం తెలిసిందే. వీటిలో భూమి ధరతోపాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూమిని అభివృద్ధి చేసేందుకు అయిన ఖర్చులు కలుపుకొని ధరలు నిర్ధారిస్తారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీజీఐఐసీ పారిశ్రామికవాడల్లో నామమాత్ర ధరలకే భూములు కేటాయిస్తున్నది. భూములు కొనుగోలుచేసినవారు సుమారు ఏడాదిలోగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి లేదంటే జాప్యానికి కారణాలు తెలుపుతూ టీజీఐఐసీ నుంచి గడువు పెంచుకునే వెసులుబాటు పొందవచ్చును. ఈ నేపథ్యంలో పాశమైలారం, మల్కాపూర్, వర్గల్, మనోహరాబాద్ తదితర పారిశ్రామికవాడల్లో అనేకమంది పారిశ్రామికవేత్తలు గతంలో భూములు కొనుగోలు చేయగా, ఇప్పుడు వాటిలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. అలాంటి వారికి క్షేత్రస్థాయిలో చేదు అనుభవం ఎదురవుతున్నది. ‘మీకు భూములు దక్కకుండా చేస్తాం, అవసరమైతే సీఎంవో నుంచి కూడా వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇప్పిస్తాం..’ అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొర్రీలు వేస్తూ భూ కేటాయింపులు రద్దుచేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు.
గతంలో నామమాత్ర ధరలకు భూములు విక్రయించిన అనేక పారిశ్రామికవాడల్లో నేడు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కొత్త పారిశ్రామికవాడల అభివృద్ధి నిలిచిపోవడంతో ఉన్న పారిశ్రామికవాడలకు గిరాకీ పెరుగగా అధికారపార్టీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారుతున్నది. లొంగనివారిని నిబంధనల బూచీచూపుతూ భయభ్రాంతులకు గురిచేయడం, గజాల చొప్పున ధరలు నిర్ణయించి ఇస్తేనే భూములు దక్కుతాయని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేం లేక భూములు కొన్న వారంతా అడిగినంత చెల్లించడానికి ముందుకొస్తున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత గజానికి రూ.10వేల ధరగా నిర్ణయించి ప్లాట్ల యజమానులనుంచి వసూళ్లకు స్కెచ్ గీశారు. బాధితులు తెలిసిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీని ఆశ్రయించగా వారు నిస్సహాయత వ్యక్తం చేయడంతో చేసేదేమీ లేక బాధితులు ఒకేసారి రూ.27 కోట్లు సదరు నేతకు సమర్పించుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
సిద్దిపేట జిల్లా వర్గల్ పారిశ్రామికవాడలోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకొచ్చిం ది. ఓ మాజీ ఎమ్మెల్యే పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చేవారిని భయపెడుతున్నట్టు సమాచారం. టీజీఐఐసీ గతంలో భూసేకరణ జరిపిన రైతులకు ఆశించినంత పరిహారం చెల్లించలేదని, అందుకే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం లేదని బెదిరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ పారిశ్రామికవేత్త తాను కొనుగోలుచేసిన ఎకరం స్థలంలో ఎంఎస్ఎంఈ స్థాపనకు సమాయత్తమయ్యారు. భూమి చదునుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా సదరు మాజీ ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో చేసేదిలేక ఆ నేతతో చర్చించి కోరినంత ముట్టజెప్పి సర్దుబాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికరంగంలో ఆటవిక విధానాలు ఎక్కువయ్యాయని పరిశ్రమవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. బీఆర్ఎస్ హ యాంలో కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా చేదు అనుభవాలు ఎదురుకాలేదని, యంత్రాంగం ఆమ్యామ్యాలకు కొర్రీలు పెట్టకుండా టీజీ ఐ పాస్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి జాప్యాన్ని నివారించారని గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ గతంలో భూములు కొనుగోలు చేసినవారిని కూ డా వదిలిపెట్టడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 156 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసి సుమారు 28,000 ఎకరాల భూములు పరిశ్రమలకు కేటాయించగా, ఎక్కడా పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలిగిన దాఖలాలు లేవని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్, కామారెడ్డి పారిశ్రామికవాడల్లోనూ ఇదే పరిస్థితి. మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో ఇటీవల చిన్నతరహా పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొచ్చిన ఒకరు భూమిని చదును చేసుకుంటుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు పనులు నిలిపివేశారు. ముందు ఎమ్మెల్యేని కలిసిరావాలని, లేకుంటే పనులు సాగవని అతడిని హెచ్చరించారు. అలాగే, కామారెడ్డి పారిశ్రామికవాడల్లో పరిశ్రమ ఏర్పాటుకు వెళ్లగా స్థానిక కాంగ్రెస్ నేత అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు తమది ట్రాన్స్పోర్ట్ యూనియన్ అని, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన కన్స్ట్రక్షన్ మెటీరియల్ తమ వద్దే కొనాలని, పరిశ్రమకు సంబంధించిన యంత్ర సామగ్రిని తమ లారీల్లోనే తరలించాలని హుకుం జారీ చేశారు. తమ నాయకుడికి సహకరించకపోతే పరిశ్రమ ఏర్పాటు అసాధ్యమని బహిరంగంగానే హెచ్చరించినట్టు తెలిసింది.