సుబేదారి, డిసెంబర్ 9 : వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు తన స్నేహితుడి భార్యను నమ్మించి రూ.20 లక్షల లోన్ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ‘నేను సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి మనిషిని’ అంటూ బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. పైగా ఆమెపై రెండుసార్లు దాడి చేసి కారు, బైక్, నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు కాంగ్రెస్ నాయకుడిపై సుబేదారి పీఎస్‌లో కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం.. నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బండి సందీప్ స్నేహితుడి కుటుంబం ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నది.
స్నేహితుడి భార్యను నమ్మించి ఆమె పేరు మీద సందీప్ రూ.20 లక్షల లోన్ తీసుకున్నాడు. స్నేహితుడు లేని సమయంలో ఇంటికి వచ్చి తాను సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి మనిషినని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ‘ఎదురు తిరిగితే నీతోపాటు నీ భర్తను కూడా చంపేస్తా. నా వద్ద వందమంది రౌడీలు ఉన్నారు. ఒక్క మాట చెబితే నీ కుమారుడిని స్కూల్ నుంచి కిడ్నాప్ చేయిస్తా’ అని బెదిరించడంతో ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. నవంబర్ 5న సందీప్ కొందరిని వెంటబెట్టుకొని బాధితురాలి ఇంటికి వచ్చి వంట గదిలో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల గోల్డ్ చైన్, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.
మరునాడు బాధితురాలు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. నవంబర్ 25న మళ్లీ సందీప్ కొందరిని తీసుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ.. కారు, రూ.లక్షన్నర నగదు, 3 ఫోన్లు, బైక్‌ను తీసుకెళ్లాడు. రెండోసారి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి 4రోజుల క్రితం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు ఈ నెల 7న సందీప్‌పై కేసు నమోదు చేశారు. సందీప్‌తో తమకు ప్రాణభయం ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది.