రామచంద్రాపురం, జూన్11 : డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశ్వర్‌సింగ్, నారాయణ్‌సింగ్ చౌదరిని బెంగళూరు సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలోకి వెళ్తే.. నిందితులిద్దరూ ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ మంజునాథ్, అతడి భార్యకు ఫోన్ చేసి.. ‘మీ క్రెడిట్ కార్డు గడువు ముగిసిందని, బ్యాంకు ఖాతాలు సీబీఐ, ఈడీలలో నమోదైన మనీలాండరింగ్ కేసులతో ముడిపడి ఉన్నాయని, ఇద్దరిని తీహార్ జైలులో పెడతాం’ అని బెదిరించారు. నైజీరియాలో ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఈ జంట ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. నిందితులు వారిని మూడు నెలలుగా హింసించి డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి ఖాతా నుంచి నిందితుల ఖాతాలకు రూ.4.79 కోట్లు బదిలీ చేయించి, ఆస్తి పత్రాలను కూడా తీసుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత బాధితులు స్కామ్‌లో చిక్కుకున్నామని గ్రహించి సౌత్ ఈస్ట్రన్ డివిజన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశ్వర్‌సింగ్ ఖాతాకు రూ.10 లక్షలు, నారాయణ్‌సింగ్ చౌదరి ఖాతాకు రూ.1.80 కోట్లు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు శ్రీలంకలో క్యాసినో ఆడటానికి ఈ డబ్బు ఉపయోగించారని తేలింది. నిందితులు ఇద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. క్రైమ్‌కి సంబంధించిన వార్తను బెంగళూరు పబ్లిక్ టీవీ ఇంగ్లిష్ మీడియా ప్రచురించగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.