వేములవాడ/కోనరావుపేట, జూలై 8 : అవసరాల కోసం రూ.3లక్షలు తీసుకొని, తిరిగి అడిగిన ఓ దళిత కుటుంబంపై కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి దిగిన వ్యవహారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకున్నది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాధిత కుటుంబం మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన మాసం ఆనందంకు కొడుకు సాల్మన్ ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నిజామాబాద్ మారెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, అతడి కొడుకు హరీశ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో రూ.3లక్షలను సాల్మన్ ఫోన్ పే చేశాడు.
అందులో కొంత డబ్బు తిరిగి ఇవ్వగా, ఇంకా రూ.2లక్షల 15వేలు రావాల్సి ఉన్నది. సాల్మన్ కుటుంబానికి ఇటీవల ఇందిమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అవసరం కాగా ఎల్లయ్యను అడిగారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించానని, డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని, అందులో రూ.లక్ష పట్టుకుంటానని ఎల్లయ్య చెప్పాడు. దీంతో బాధితుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎల్లయ్య గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి, డబ్బులు ఇచ్చేది లేదని, ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో.. అని హెచ్చరించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను వారికి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నానని, ఆ డబ్బులకు వడ్డీ కూడా కడుతున్నానని సాల్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పిస్తామని నమ్మించి, ప్రభుత్వ విప్ వ్యక్తిగత సహాయకుడి పేరు చెప్పి మరో రూ.20 వేలు వసూలు చేశారని ఆరోపించాడు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పేర్కొన్నారు. తన కొడుకు హరీశ్, సాల్మన్ ఇద్దరూ స్నేహితులని చెప్పారు. తాను ఎవరి వద్దా ఒక్క రూపాయి తీసుకోలేదని, కావాలనే తనను బద్నాం చేస్తున్నారని పేర్కొన్నారు.