హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో మరో నలుగురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డికు క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొంతకాలంగా కాంగ్రెస్‌లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఉట్నూర్‌లో ఇటీవల జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా సంజీవరెడ్డి వచ్చారంటూ కంది శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమక్షంలోనే ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో ఈ ఘటనపై వివరణ కోరు తూ ఇద్దరికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులిచ్చింది. నర్సారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లారెడ్డి పీసీసీకి ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చారు.