హైదరాబాద్ , ఆగస్టు 30(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని ప్రభుత్వం నడిపే ప్రతి ఒక్కరికీ తెలుసు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాని ప్రమేయం లేకుండా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం అసాధ్యమనీ తెలుసు. ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయమూ తెలుసు. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేసే అధికారం క్యాబినెట్‌కు లేదనీ తెలుసు.
రాష్ట్రపతి వద్ద రెండు బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించరనీ తెలుసు.. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలులుగా బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతున్నది. రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని మరోసారి, పార్టీ పరంగా కల్పిస్తామని ఇంకోసారి చెప్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రత్యేక జీవో ద్వారా కోటా పరిమితి ఎత్తివేసి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఊదరగొడుతున్నది. పూటకో మాటతో ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నది.
50 శాతం రిజర్వేషన్ల కోటా పరిమితిని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. కోటా పరిమితిని సడలించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే మూడు దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ సీలింగ్‌ను సడలించే రాజ్యాంగ హక్కు రాష్ర్టానికి ఉన్నదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వ జీవో న్యాయ సమీక్ష ముందు నిలబడుతుందా? అన్నది మరో ప్రశ్న.
ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా సొంత జీవోలతో కోటా పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేయలేదు. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం ఆర్డినెన్స్ ద్వారా బిల్లును అమలు చేయాలని క్యాబినెట్లో నిర్ణయించింది. ఆదివారం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, తీసుకున్నా అవి రాజ్యాంగ పరంగా, న్యాయపరంగా చెల్లుబాటు కావని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా బీహార్ ఎన్నికల కోసం తెలంగాణలోని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇవి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 52 సార్లు ఢిల్లీ వెళ్లినా వాటిని ఆమోదించాలని కోరుతూ ఒక్కసారి కూడా ప్రధానిని కానీ, కేంద్ర మంత్రులను కానీ కలవలేదు. ఇండియా కూటమి ద్వారా పార్లమెంటులో ఒత్తిడికి కూడా ప్రయత్నించలేదు. బీసీ బిల్లుల ఆమోదానికి చేపట్టాల్సిన న్యాయపరమైన ప్రక్రియ చేపట్టకున్నా కేంద్రం మాత్రం వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేయడం గమనార్హం.
కోటా పరిమితిని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులపై హైకోర్టులో చిన్న పిటిషన్ వేసినా కోర్టు ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కోర్టుకు ఎవరు వెళ్లినా కేసీఆరే కోర్టుకు వెళ్లి ఎన్నికలు ఆపివేయించారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. పార్టీ పరమైన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తొలుత అనుకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తాకే అవకాశం ఉందని, బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని ఏఐసీసీ హెచ్చరించడంతో ప్లాన్ మార్చినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
ఉత్తర్వుల ద్వారానే ముందుకు వెళ్లాలని, అవి ఎలాగూ న్యాయ సమీక్షకు నిలబడవు కాబట్టి ఎన్నికలు వాయిదా పడతాయని, ఈ లోగా బీహార్ ఎన్నికలు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఈలోగా ప్రజలకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా కేసీఆరే ఎన్నికలు ఆపివేయించారని పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.