Congress MLAs | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అన్న సందిగ్ధత వారిలో నెలకొన్నది. పనుల్లేవు.. పైసల్లేవు.. పదవులు అంతకన్నా లేవు. ఇవేవీ లేకుండా ఇక రాజకీయం చేసెదెట్లా అంటూ వారు తమ సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరిస్థితి చూసి బయట అప్పు కూడా పుట్టడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం కనీసం పథకాలనైనా సరిగ్గా అమలు చేసి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. హైడ్రా పేరుతో చేసిన, చేస్తున్న విధ్వంసంతో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి లేదు, పథకాల్లేవు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్లాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అని పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారు. ఇందుకు సంబంధించి పార్టీలో, ప్రభుత్వంలో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి.
సొంత సర్కారు పనితీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వస్తే ఏమైనా పనులు చేసుకొని నష్టాలను భర్తీ చేసుకోవచ్చని భావించామని, కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి ఉందంటూ వారు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఒక్కటంటే ఒక్క పని కూడా కాలేదని ఓ ఎమ్మెల్యే తన బాధను చెప్పుకొన్నారు. పనుల కోసం మంత్రులను, ప్రభుత్వాన్ని సంప్రదించినా ఫలితం దక్కడం లేదని మండిపడ్డారు. దీంతో ఖర్చులకు కూడా పైసలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతున్నదని, కనీసం ఆ అప్పు కూడా తీర్చే మార్గం దొరకడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అప్పులు ఇచ్చారని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా.. ఎక్కడా అప్పు పుట్టడం లేదని అంటున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి.. సహజంగానే తమపై ప్రజలకు, కార్యకర్తలకు అంచనాలుంటాయని, ఆ అంచనాలకు తగ్గట్టే ఖర్చులు భారీగా పెరిగాయని అన్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే .. ఓ చిన్న వ్యాపారిని రూ. 5 లక్షల అప్పు అడిగినట్టు తెలిసింది. అయితే ఆయన అప్పు ఇచ్చేందుకు సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో సదరు ఎమ్మెల్యే తన పరిస్థితి, పరపతిపై తనకుతానే కార్యకర్తల వద్ద విమర్శించుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యంతో తాము గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ పథకాన్ని ప్రభుత్వం సక్కగా అమలు చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క పథకాన్ని కూడా కోతలు లేకుండా అమలు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీలో కోతలు పెట్టి సగమే అమలు చేశారు, రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకున్నారు తప్ప వాటికి అతీగతీ లేదు, ఇందిరమ్మ ఇండ్లపై నాలుగుసార్లు ప్రకటన చేసి ఇంకా ప్రారంభించలేదు, రైతుభరోసా పంపిణీ జరుగలేదు.. ఇలా ఏ పథకం చూసినా అరకొరగా అమలవుతున్నదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊర్లలోకి వెళ్లి సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా ఆడగాలని అధిష్ఠానాన్ని నిలదీస్తున్నారు.
రెండు రోజుల క్రితం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఇందులో ప్రధానమైనది.. సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలి. దీనిపై ఎమ్మెల్యేలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఏకగ్రీవం చేయాలని చెప్పడం సులువే.. కానీ ఎలా చేయాలో కూడా చెప్పాలి కదా’ అంటూ ఓ ఎమ్మెల్యే పార్టీ పెద్దల్ని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వ పెద్దల నుంచి ఓ గైడెన్స్ లేదు, పనులు లేవు, ఆర్థిక సహకారం లేదు.. అలాంటప్పుడు ఏకగ్రీవాలు ఎలా అవుతాయని నిలదీసినట్టు సమాచారం. ఏకగ్రీవం కావాలంటే ఆ గ్రామ ప్రజలకు పార్టీ తరపున ఏదో ఒక కచ్చితమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఆ పరిస్థితి ప్రభుత్వంలో ఉందా అని ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి సహాయసహకారాలు అందించకుండా ఏకగ్రీవం చేయాలంటూ టార్గెట్లు పెడితే ప్రయోజనం ఏంటని నిరసన వ్యక్తంచేసినట్టు సమాచారం.
పథకాల అమలులో విఫలమైన ప్రభుత్వం.. హైడ్రాతో జనాల్లో విమర్శలు మూటగట్టుకుందని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. హైడ్రాతో అంతా ఆగమాగం చేశారని మండిపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలతో రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తి కుదేలైపోయిందని, తద్వారా తమ ఆదాయం కూడా భారీగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా వల్ల ప్రభుత్వానికి జరిగిన మేలు కన్నా.. నష్టమే ఎక్కువని చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని తమ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. లక్షల మంది ప్రజలు తమ అవసరాలకు, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం ఓపెన్ ప్లాట్లు విక్రయించాలని ప్రయత్నించినా అమ్ముడుపోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన ఆలోచన చేయాలని కోరుతున్నారు.