హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ (BRS) అధ్యయన కమిటీ వరంగల్ పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఉమ్మడి జిల్లా పర్యటనను కమిటీ వాయిదా వేసుకున్నది. రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీ వేశారు. కాంగ్రెస్ ఏడాదిపాలనలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది.
గురువారం వరంగల్ జిల్లాలోని సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో కమిటీ పర్యటించాల్సి ఉన్నది. పోచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మహారాజ్తండాకు చెందిన రైతు బానోత్ తిరుపతి అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబాన్ని హరీశ్‌రావుతోపాటు కమిటీ సభ్యులు పరామర్శించాల్సి ఉన్నది. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం, పోలీసుల అనుమతి లేకపోవడంతో పర్యటనను కమిటీ వాయిదా వేసుకున్నది.
కాగా, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నది. అయితే కొన్ని గ్రామాల రైతులకు మాత్రమే నిధులు జమకావడంతో ప్రభుత్వంపై అన్నదాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకెప్పుడు ఇస్తారంటూ ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధ్యయన కమిటీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తున్నది.