హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల (Gurukula School) సొసైటీ ఆర్మీ శిక్షణకు మంగళం పాడేసింది. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా, అనాలోచిత నిర్ణయా ల ఫలితంగా ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ కాలేజీ, రుక్మాపూర్ సైనిక స్కూల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందకుండా పోతున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విన్నపాలు చేస్తున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నా ఉన్నతాధికారులకు చేరడం లేదు. గ్రామీ ణ మహిళలకు సాధికారత కల్పించడం, సా యుధ దళాలకు మార్గదర్శకత్వం వహించేలా, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో పలు ప్రత్యేక గురుకుల కాలేజీలను ఏర్పాటుచేశారు.
ఇందు లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2018లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (టీజీ ఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీడబ్ల్యూ)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ బాలికలకు మూడేండ్లపాటు సాయుధ దళాల కోసం సమగ్రమైన, అకాడమిక్, రక్షణకు సం బంధించిన అంశాలపై శిక్షణ అందిస్తున్నది. ఏటా కళాశాలలో చేరిన 150 మంది మహిళా క్యాడెట్లు ఆర్ట్స్, సైన్స్ లేదా కామ ర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలను అభ్యసించడంతోపాటు, అదే సమయంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షకు సైతం సిద్ధంచేస్తున్నది. క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణ, ధైర్యం, నిజాయితీపై సంస్థ దృష్టి కేంద్రీకరించడం వల్ల దేశాన్ని రక్షించడానికి అవసరమైన విలువలను క్యాడెట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు, అన్నివిధాలుగా సన్నద్ధం చేస్తూ వస్తున్నది. గ్రామీణ ప్రాంత బాలికలు సాయుధ ద ళాలలో చేరడానికి విస్తృత అవకాశాలను కల్పిస్తున్నది. ఈ శిక్షణ కారణంగా కాలేజీలో విద్య ను పూర్తిచేసుకున్న విద్యార్థినులు ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్‌తోపాటు, అనేక పరీక్షల్లో సత్తాచాటుతున్నారు.
సైనిక్ స్కూల్ పరిస్థితి అంతే?
జాతీయ సైనిక పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలోని విద్యార్థులకు సైనిక శిక్షణను అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. 2017-18 విద్యాసంవత్సరంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యలో గురుకుల సైనిక్ స్కూల్‌ను ఏర్పా టు చేసింది. సైనిక్ స్కూల్ నిర్వహణ, అందులోని విద్యార్థులకు ప్రత్యేక బోధన షెడ్యూల్‌ను గతంలోనే ఖరారు చేశారు. పాఠశాల నిర్వహణ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో, సైనిక శిక్షణ కల్నల్ స్థాయి (డైరెక్టర్) ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇక డైరెక్టర్ ఆధ్వర్యంలో 6 ఇన్‌స్ట్రక్లర్లు ఉండాల్సి ఉంది. వారే విద్యార్థులకు సైనిక శిక్షణ అందిస్తారు. ఉదయం 5 గంటల నుంచి పరేడ్‌తోపాటు, తదితర సైనిక అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ఆరంభం నుంచి డైరెక్టర్‌నే నియమించలేదు. ఆరుగురు ఇన్స్ట్రక్టర్లు ఉండాల్సిన చోట ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు సైనిక శిక్షణ అనేది లేకుండా పోతున్నది.
ఉన్న సిబ్బందితోనే అరకొరగా నెట్టుకొస్తున్నారు. అదీగాక సైనిక్ స్కూల్ విద్యార్థులకు సైనిక శిక్షణతోపాటు సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంటర్ విద్యను అందిస్తారు. జాతీయస్థాయిలో నిర్వహించే డిఫెన్స్, నేవీ తదితర పోటీపరీక్షలకు ప్రత్యేక ఇంటెన్సీవ్ కోచింగ్ ఇస్తారు. మ్యాథ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. గురుకులంలో మొత్తంగా 18క్వార్టర్స్ ఉన్నాయి. అందులో పాతవి 12, కొత్తవి 6 ఉన్నాయి. వాటిల్లో ఎన్డీయే సిబ్బందికి క్వార్టర్స్ కేటాయించారు. అయితే కాంగ్రెస్ వచ్చాక ప్రస్తుతం ఎన్డీయే సిబ్బందికి క్వార్టర్స్‌ను కేటాయించడం లేదు. దీంతో ఎన్డీయే సిబ్బంది దూర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. దీంతో ఎన్డీయే తరగతుల నిర్వహణ సైతం అరకొరగానే కొనసాగుతున్న దుస్థితి నెలకొన్నది. ఇకనైనా ఈ ప్రత్యేక పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అడ్డగోలు నిర్ణయాలతో..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రిపరేటరీ కాలేజీ పరిస్థితి అధ్వానంగా మారింది. గతేడాది విద్యా సంవత్సరం మధ్యలో క్యాంపస్‌ను బీబీనగర్ నుంచి ఘట్కేసర్ పరిధిలో ని అవుశాపూర్‌కు తరలించారు. ఆర్మీ సిబ్బం ది బహుమతిగా ఇచ్చిన యుద్ధ ట్యాంకుల ను తీసుకురాకుండా అక్కడే పడేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. ఆర్మీ పోల్స్, ఇతర ఎక్విప్మెంట్ను కూకటి వేళ్లతో తొలగించేశారు. నాటినుంచి అవుశాపూర్ క్యాంపస్‌లో కేవలం థియరీ క్లాస్‌లను మాత్రమే చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజీని షిఫ్ట్ చేసిన నాటి నుంచి ప్రిపరేటరీ కాలేజీ నిర్వహణను సొసైటీ ఉన్నతాధికారులు గాలికివదిలేశారని విద్యార్థులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. డైరెక్టర్ పదవీ విరమణ పొంది నెలలు గడచినా ఇప్పటివరకు నియమించలేదన్నారు. సాయుధ శిక్షణ, క్యాంపులకు సంబంధించి డైరెక్టర్ కీలకభూమిక పోషిస్తారు. అలాంటి పోస్టును కూడా నెలలుగా భర్తీ చేయడం లేదంటే సొసైటీ ఏ తీరుగా పర్యవేక్షిస్తున్నదో అర్థం చేసుకోవచ్చని ఉదహరిస్తున్నారు.