పొరపాటు కాదిది.. కుట్రపూరితం! అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది కాదిది.. నెలలతరబడి సాగిన కుతంత్రం! 22ఏ నిషేధ జాబితా లోగుట్టు బయట పడింది. కాంగ్రెస్ సర్కార్ అసలు బండారం బద్ధలైంది. ఒక్కదగ్గరో, ఒక్క జిల్లాకో పరిమితమైన విషయం కాదిది. రాష్ట్రమంతా 22ఏ పడగ నీడలోనే ఉన్నది! వందల ఎకరాలకు సంబంధించిన సమస్య కాదిది. అక్షరాల కోటి ఎకరాలు నిషిద్ధ జాబితాలో చేర్చిన సంక్షోభం! రాష్ట్రంలోని సగం భూమి బ్లాక్ లిస్టులోనే ఉన్నది. ప్రజల ఆస్తులను ప్రశ్నార్థకం చేసిందీ, సామాన్యుడి నెత్తిన సమస్యలను రుద్దింది కాంగ్రెస్ సర్కారే!
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నిషేధిత భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ బండారం బయటపడింది. రాష్ట్రంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ‘22 ఏ’ జాబితాలో చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘భూ భారతి’ లెక్క ప్రకారమే నిషేధిత జాబితాలో ఉన్న భూమి అక్షరాల కోటి ఎకరాలకుపైనే. ఇది స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన లెక్క. భూ భారతిలో 1,01,76,068 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పొందుపరిచినట్టు ఆయన సోమవారం వెల్లడించారు. దీంతో భూ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిందని ‘నమస్తే తెలంగాణ’ ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నది. ఇప్పుడు అదే నిజమయ్యింది. ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే తేడా లేకుండా ఇండ్లు, పొలాలను ప్రభుత్వం 22 ఏ జాబితాలోకి నెట్టేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భయం పట్టుకున్నది. అయితే.. ధరణి అమల్లో ఉన్నప్పుడు 22ఏ జాబితాలో ఎంత భూమి ఉన్నదో మాత్రం వెల్లడించడం లేదు. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
భూ భారతి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూమి 2,49,97,312 ఎకరాలు ఉన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీటిలో 1,01,76,068 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. అంటే మొత్తం భూమిలో దాదాపు 41శాతం విస్తీర్ణంపై నిషేధం విధించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇందులో ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, చెరువు, శిఖం, దేవాదాయ భూములు, రోడ్లు, ఇతర భూములు ఉన్నట్టు పేర్కొన్నది. వీటితోపాటు 3,73,524 ఎకరాలు వ్యవసాయ భూమి కూడా నిషేధ జాబితాలో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. దీనిని బట్టి 22ఏ జాబితా 97 శాతం సవ్యంగా ఉన్నదని మంత్రి స్వయంగా ప్రకటించారన్నమాట.
మంత్రి పొంగులేటి వెల్లడించిన భూముల లెక్క ‘అందరూ శాకాహారులే గానీ గంప కింద కోడి మాయమైంది’ అన్నట్టుగా ఉన్నదని రెవెన్యూ నిపుణులు విమర్శిస్తున్నారు. భూ భారతిలోని నిషేధిత జాబితాలో దాదాపు అన్నీ ప్రభుత్వానికి సంబంధించిన భూములే ఉన్నాయి. అటవీ, అసైన్డ్, ప్రభుత్వ, చెరువు, శిఖం, దేవాదాయ భూములు, రోడ్లు వంటివే ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే 22ఏ జాబితాలో ఎలాంటి తప్పులు జరుగలేదన్నట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాపై ఇంత రచ్చ ఎందుకు జరుగుతున్నదని నిలదీస్తున్నారు. దీనిని బట్టే ప్రభుత్వం వాస్తవాలను దాచి, తప్పుడు లెక్కలు చెప్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ అధికారులు పట్టా భూములను తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చారని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
పైగా, జరిగిన తప్పునకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. మరి.. సోమవారం వెల్లడించిన నిషేధిత భూముల జాబితాలో మొత్తం ప్రభుత్వ భూములనే ఎందుకు చూపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కలన్నీ సవ్యంగానే ఉంటే క్షమాపణలెందుకు చెప్పినట్టు అని ప్రశ్నిస్తున్నారు. గణాంకాల్లో ప్రభుత్వ, ఇతర భూములుగా చెప్తున్నవాటిలో రికార్డుల పరంగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. వేలాది రైతులకు చెందిన పట్టా భూములను ప్రభుత్వ భూములుగా మార్చి, 22ఏ జాబితాలో పొందుపరిచారని చెప్పారు. మంత్రి పొంగులేటి సైతం ఇటీవల మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండి, ఆ తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన భూములను సైతం తమ అధికారులు పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చినట్టు వెల్లడించారు. దీనిని బట్టి మంత్రి చెప్పిన కోటి ఎకరాల నిషేధిత జాబితాలో క్లియరెన్స్ ఇచ్చిన భూములు ఎన్ని ఉన్నాయో అనే చర్చ జరుగుతున్నది.
22ఏ జాబితా వివాదం మొదలైనప్పటి నుంచీ ప్రభుత్వ పెద్దలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో భూములను కాజేసేందుకే ‘నిషేధిత’ భూతాన్ని తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వం తీరు దీనికి బలం చేకూర్చుతున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం భూ భారతిలో నిషేధిత భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో మాత్రమే వెల్లడించారు. కానీ గతంలో ‘ధరణి’ అమల్లో ఉన్నప్పుడు ఎంత విస్తీర్ణం ఉన్నదనే లెక్కలను మాత్రం దాచడం గమనార్హం. గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలిస్తే, ఇప్పుడు భూ భారతిలో ఉన్న లెక్కతో పోల్చవచ్చు. తద్వారా జాబితా పెరిగిందో, తగ్గిందో తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిలో అదనంగా ఎన్ని లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చిందో తేలుతుంది. కానీ ధరణిలో భూముల లెక్కను బహిర్గతం చేయకుండా, భూ భారతిలోని గణాంకాలను మాత్రమే బయటపెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగి ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దొంగాట ఆడటం మానేసి, వెంటనే ధరణి రికార్డులను సైతం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
