హైదరాబాద్, ఫిబ్రవరి7 ( నమస్తే తెలంగాణ) : కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను వెల్లడించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. పూర్తి నివేదికను బయటపెట్టే విషయంలో పూర్తిగా డైలామాలో పడింది. ఇప్పటికే సర్వేను తప్పులతడకగా, పూర్తిగా అసంబద్ధంగా నిర్వహించారని, బీసీ జనాభాను 20 లక్షలకు పైగా తగ్గించారని బీసీ సంఘాల నేతలు, మేధావులు, సామాజికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలో కులాలు, ఉపకులాల వారీగా నివేదికను బయటపెడితే మరింత ఇరకాటంలో, వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి నివేదికను బయటపెట్టకుండా ఉంటే నే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్టు ప్రభుత్వవర్గాలే వెల్లడిస్తున్నాయి. రెండు మూడురోజుల్లోనే పూర్తి నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడతామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా వెనుకడుగు వేసిందని అర్థమవుతున్నది. కాంగ్రెస్ ప్రభు త్వం గత నవంబర్‌లో నిర్వహించిన ఇం టింటి సర్వేను మూడు దశల్లో చేపట్టింది. మొత్తం జనాభా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు ప్రభు త్వం ఇటీవల నివేదిక వివరాలను వెల్లడించింది. స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలనే తెలిపింది. బీసీ జనాభా 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఓసీ 15.79%, ఎస్టీలు 10.45% ఉన్నట్టు నిర్ధారించింది. ఆయా గణాంకాలపై అప్పటి నుంచీ తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి.
సర్వే నివేదిక వివరాలను తొలుత క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం రాబోయే రెండు మూడ్రోజుల్లోనే పూర్తిస్థాయి నివేదికను పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ నివేదికను వెల్లడించనేలేదు. ప్రస్తుతం నివేదిక వెల్లడికి ప్రభుత్వం విముఖత చూపుతున్నదని అధికార వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఊహించని విధంగా పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చూసి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని వినికిడి. ఇలాంటి సమయంలో కులాలు, ఉపకులాల వారీగా గణాంకాలపై బయటపెడితే మరింత ముప్పు తప్పదని, పుండుమీద కారం చల్లినట్టుగా ఉంటుందని సర్కారు ఆందోళనకు గురవుతున్నది.
సర్కారు కొత్త ఎత్తుగడలను వేస్తున్నది. కులాలవారీ వివరాలను వెల్లడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అనుకూల మీడియాకు కొన్ని కులాల వివరాలను లీకు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే 5 మెజార్టీ బీసీ కులాల లెక్కలపై లీకులిచ్చింది. ముదిరాజ్‌లు 36 లక్షలకు పైగా ఉంటారని, 26 లక్షల జనాభాతో గౌడ సామాజికవర్గం, యాదవులు, మున్నూరుకాపులు, పద్మశాలి సామాజిక వర్గాలు ఇంతమంది ఉన్నారంటూ ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎలాంటి వివాదాలు, ఆందోళనలు లేకుంటే పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు, ఆ పార్టీ నేతలే వివరిస్తున్నారు.
ఇంటింటి సర్వే నివేదికను పూర్తిస్తాయిలో వెల్లడించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులసంఘాలు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవ అంచనాలకు పూర్తి విరుద్ధంగా జనాభాను తగ్గించి చూపారని బీసీ, ఎస్సీ వర్గాలు మండిపడుతున్నాయి. ఏ మేరకు, ఏ జిల్లాలో, ఎందువల్ల? ఏ బీసీ కులాల, ఉపకులాల జనాభా తగ్గిందో తెలిపాలని కోరుతున్నారు. అన్నికులాల వారీగా జనాభా వివరాలు, ఆర్థిక స్థితిగతులు, ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలను పొందింది? ఏ కులం తక్కువ అవకాశాలను పొందింది? తదితర వివరాలను నివేదించాల్సిందేనని పట్టుబడుతున్నారు. సర్వే సమయంలో చాలావరకు తమ వివరాలనే నమోదు చేయలేదని, గణాంకాలను ఏమేరకు తగ్గించారోనని సంచార జాతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజాన్ని ఒకే జాతీయులుగా కాకుండా, రెండు వేర్వేరు వర్గాలుగా విభిజించి చూపారని, దీంతో తమ జనాభాను తక్కువ చూపే అవకాశం ఉన్నదని ఆ కులసంఘాలు మండిపడుతున్నాయి. ఇదే తరహాలో అన్నికులాలు తమ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి.