హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు కరువుభత్యం (డీఏ), ఇతర బకాయిలు చెల్లించలేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని దుయ్యబట్టారు. దసరా పోయి దీపావళి వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక కొండయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుండెపోటుతోమరణించాడని, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, సత్యనారాయణ అనే రిటైర్డ్ ఉద్యోగి ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఉద్యోగులు కోర్టులకెళ్లి ఆర్డర్లు తెచ్చుకున్నా ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల కోసం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఎన్నడైనా ఆమేరకు విడుదల చేసిందా? అని నిలదీశారు.
తూతూ మంత్రంగా నిధుల విడుదల
ఉద్యోగుల కోసం తూతూ మంత్రంగా విడుదలచేస్తున్న రూ.10 కోట్లు, రూ.20 కోట్లు ఏ మూలకూ సరిపోవడంలేదని దేవీప్రసాద్ పేర్కొన్నారు. ఇలాగైతే వందేండ్లు అయినా ఉద్యోగుల బకాయిలు తీరవని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం రూ.15వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పెన్షనర్లు బతుకవద్దా? నిలదీశారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, ఇస్తామన్న ఐదు డీఏలు, కనీసం పండుగల అడ్వాన్స్‌లు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు భుజంగరావు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.