జనగామ, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మహాకవి పోతన జన్మస్థలమైన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో టూరిజం ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. శ్రీమద్భాగవతాన్ని అనువదించి తెలుగువారి మనసులను రంజింపజేసిన పోతనామాత్యుడు పుట్టిన బమ్మెరలో పోతన స్మృతివనం, మ్యూజియం, కల్యాణ మండపం, బాసర తరహా అక్షరాభ్యాస మందిరం వంటి అభివృద్ధి పనులతో మహాకవి పుట్టినగడ్డను పర్యాటకంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజం ప్యాకేజీలో భాగంగా రూ.14 కోట్లు మంజూరు చేసింది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బమ్మెర టూరిజం సర్క్యూట్ పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత 2023 వరకు పనులు శరవేగంగా ముందుకుసాగాయి.
రూ.2.5 కోట్ల వ్యయంతో బమ్మెరలో మహాకవి పోతన 22 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి తెప్పించి ప్రతిష్ఠించారు. చకచకా పనులు సాగుతుండగానే ప్రభుత్వం మారింది. గతంలో మంజూరైన నిధులను కాంగ్రెస్ పాలకులు కక్షగట్టి విడుదల చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టలేమని చేతులెత్తేసింది. చారిత్రక ప్రాంతంగా గుర్తింపు పొందిన పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన జన్మస్థలాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్నువేసింది. ఫలితంగా ఏడాదిన్నరగా స్మృతివనం, మ్యూజియం, ఆర్ట్ థియేటర్, లైబ్రరీ, కల్యాణ మండపం వంటి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
నిరుడు నవంబర్ 20న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కలెక్టర్.. బమ్మెరలో పర్యాటక అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించినా, ఇప్పటివరకు అడుగు ముందుకుపడలేదు. పోతన సమాధి, పోతన మోట తోలిన బావి, అక్కమాంబ వాగు (కాలువ), విద్యుత్తు, టైల్స్ పనులు, గార్డెనింగ్, ఓపెన్ థియేటర్, పార్కింగ్, ఆర్చ్గేట్లు, 22 ఫీట్ల ఎత్తయిన పోతన కాంస్య విగ్రహానికి తుది మెరుగులు దిద్దే పనులు, ఆర్ట్స్, క్రాఫ్ట్ భవనాల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నది.
నిర్లక్ష్యధోరణి వెంటాడటంతో చేపట్టిన దశలోనే ఆగిపోయి, ఈ ప్రాంతమంతా ముళ్లపొదలకు నిలయంగా మారింది. ఇక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని నెలకొల్పి చిన్నారులకు బాసర తరహాలో అక్షరాభ్యాసాలు జరిగేలా చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ సంకల్పం నెరవేరకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతనామాత్యుడి చరిత్రను భావితరాలకు అందించేందుకు చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు, స్థానికులు, సాహితీవేత్తలు, మేధావులు కోరుతున్నారు.