హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ సర్కారు సరికొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. ఫీజుల భారాన్ని తప్పించుకుని, విద్యార్థులపై మోపేందుకు కొత్త నిబంధనలను ముందుకు తెచ్చింది. ప్రొఫెషనల్ కోర్సుల్లోని విద్యార్థులు 50% సబ్జెక్టులు పాసైతేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వనున్నది. 75% హాజరు నిబంధనను పక్కాగా అమలుచేయనున్నది. ఈ రెండు అర్హతలుంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నది. లేదంటే రూపాయి కూడా ఇవ్వదు.
ఆయా ఫీజులను విద్యార్థులే తమ జేబు నుంచి చెల్లించుకోవాలి. మధ్యలో కోర్సును వదిలేసినా ఆయా ఫీజులను విద్యార్థులే భరించాలి. ఈ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ప్రొఫెషనల్ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) హాజరును తప్పనిసరిగా అమలుచేస్తారు. ఈ హాజరును ఆన్లైన్ పోర్టల్‌తో లింకుచేస్తారు. 75% హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఇక సెమిస్టర్లో 50% సబ్జెక్టులు పాస్‌కాకపోతే రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఫీజుల ఖరారు విధివిధానాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఫీజుల ఖరారు.. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై చర్చ జరిగింది. ‘విద్యార్థులు చదువుకోవాలనే మనం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. చదువుకోనప్పుడు, హాజరుశాతం లేనప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకివ్వాలి?’ అని సమావేశంలో చర్చ వచ్చినట్టు తెలిసింది. ‘డిగ్రీలిచ్చి.. పట్టాలిచ్చి రోడ్డుమీదికి వదిలేస్తే ఉద్యోగాలొచ్చే పరిస్థితిలేదు. ఈ తరుణంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మరికొందరు నిరుద్యోగులను తయారుచేయడం అవసరమా..?’ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఒక్కో విద్యార్థిపై రూ.1.2 లక్షలు ఖర్చుచేస్తున్నాం. ఇంత మొత్తం వృథా అయితే ఏం ప్రయోజనం. సెమిస్టర్లో 6 సబ్జెక్టులుంటే కనీసం మూడు పాస్‌కాకపోతే ఏం లాభం. ఈదిశగా కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేయాలన్న చర్చ నడిచినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇప్పటికే దాదాపు రూ. 8వేల కోట్ల బకాయిలున్నాయి. ఈ బకాయిలను చెల్లించలేక సర్కారు సతమతమవుతున్నది. 20 నెలల కాలంలో రూపాయి విడుదల చేయలేదు. టోకెన్లు విడుదలైన బకాయిలను కూడా పెండింగ్‌లో పెట్టింది. ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కాలేజీలను బహిష్కరించాయి. ఇదిలా ఉండగా సర్కారుపై ఏటా రూ. 2,400కోట్ల భారం పడుతున్నది. ఇలా ఏటా పెరుగుతూ పోతున్నాయి. ఈ తరుణంలో ఫీజుల భారాన్ని తప్పించుకునేందుకు ఈ నిబంధనలను తెరపైకి తెచ్చిందన్న వాదనలున్నాయి.
ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు నియమించిన అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం ఆడిటర్లు ఆమోదించిన ఆర్థిక నివేదికల ఆధారంగా ఫీజులు ఖరారుచేస్తున్నారు. ఇకపై ఆడిటర్లు ఆమోదించిన నివేదికలతో ఫీజులు ఖరారుచేయడానికి చెల్లుచీటి పడనున్నది. మరికొన్ని అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు.
కమిటీ సిఫారసు చేసిన ముఖ్యాంశాలు