VRO | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : వీఆర్వో.. ఈ పేరు వింటే ఇప్పటికీ గ్రామాల్లో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డులను నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన వీఆర్వోల వ్యవస్థ.. అన్నదాతల నెత్తమీద పిడుగులా, విచ్చలవిడి అవినీతికి కేరాఫ్‌గా మారింది. రాత్రికి రాత్రే భూమి రికార్డులను మార్చేసి రైతుల తలరాతను మార్చిన ఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటివరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒక్క రోజులోనే జీవితం తలకిందులై రోడ్డుమీద నిలబడేవారు. అందుకే వీఆర్వోలను చూస్తే రైతులు వణికిపోయేవారు. వీఆర్వోలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్లు. పైరవీలు, డబ్బులు ఉన్నది. సర్వేయర్ల నియామకానిదీ ఇదే పరిస్థితి. సాంకేతికంగా ఉన్న అడ్డంకులను పట్టించుకోకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు విద్యార్హతలతో సంబంధం లేకుండా నియామకాలు జరుపుతూ నిరుద్యోగులకు సైతం అన్యాయం చేస్తున్నది. గతంలో పనిచేసిన వారిలో ఎవరెవరు మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేయడానికి, సర్వేయర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలపాలంటూ ఇటీవల సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రక్రియను ఈ నెల 28లోగా ముగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఉద్యోగుల్లో తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉన్నతాధికారులను అడిగితే మూడు నెలల్లో నియమ నిబంధనలు రూపొందిస్తారని, ఆ తర్వాతే ‘ఏ పని, ఎంత జీతం?’ వంటి వివరాలన్నీ తెలుస్తాయని సమాధానం ఇస్తున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు.
గతంలో ఉన్న వీఆర్వోలకు భూ రికార్డుల నిర్వహణతోపాటు అనేక విధులు ఉండేవి. వారికి ప్రత్యేకంగా జాబ్‌చార్టు ఉండేది. కానీ నూతన వీఆర్వో వ్యవస్థకు ఇప్పటివరకు జాబ్ చార్ట్‌నే నిర్ణయించలేదు. భూరికార్డులను నిర్వహిస్తారని, ఏటా జమాబందీ చేయాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారు. మరి గతంలో ఉన్న మిగతా విధులు ఉన్నట్టా? లేనట్టా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీంతో ఏం పనిచేయాలో? కొత్త ఉద్యోగంలో పనిభారం ఎలా ఉంటుందో తెలియక పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు గందరగోళానికి గురవుతున్నారు.
గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయనేలేదు. ఈ పోస్టులను సృష్టించాలంటే రెవెన్యూ శాఖ నుంచి ప్రతిపాదనలు మొదలు అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లులో ప్రస్తావన తప్ప సాంకేతికంగా పోస్టుల మంజూరుపై కసరత్తు చేయలేదు. దీంతో కొత్తగా వచ్చే వీఆర్వోలది ఏ క్యాడర్ ఉద్యోగమో తెలియని పరిస్థితి. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిని ఇతర శాఖల్లోకి బదిలీ చేసినప్పుడు ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారిని జూనియర్ అసిస్టెంట్లుగా, పదో తరగతి, ఆలోపు అర్హత ఉన్నవారిని ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. కొత్తగా వచ్చే వీఆర్వో పోస్టులు జూనియర్ అసిస్టెంట్ స్థాయి అని రెవెన్యూ ఉద్యోగుల్లో ప్రచారం అవుతున్నా ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
సీసీఎల్ఏ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల్లో పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లో ‘నిర్ణీత అర్హ త’ ఉన్నవారి నుంచి విల్లింగ్ తీసుకోవాలని ఆదేశించారు. కానీ ఆ అర్హత ఏమిటన్నది స్పష్టత లేదు. పాత సిబ్బందిలో ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు పీజీ వరకు విద్యాభ్యాసం కలిగిన వారు ఉన్నారు. మరి కొత్త వీఆర్వో పోస్టులకు కనీస అర్హత ఏమి టో నిర్ణయించకుండా విల్లింగ్ లెటర్ ఎందుకు తీసుకుంటున్నట్టు? అని ప్రశ్నిస్తున్నారు.
వీఆర్వోలు దాదాపు రెండున్నరేండ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వీఆర్ఏలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గతేడాది సర్దుబాటు చేసింది. వారు దాదాపు ఏడాదిన్నరగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా వచ్చే వీఆర్వో వ్యవస్థలో చేరితే ఈ సర్వీస్ ఉంటుందా? మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందా? అనే సందేహాలు ఉద్యోగుల్లో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. పాత సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుంటేనే సీనియారిటీ కొనసాగుతుందని, భవిష్యత్తులో తమకు అవకాశాలు వస్తాయని ఉద్యోగులు చెప్తున్నారు.
గతంలో తాము దశాబ్దాలపాటు వీఆర్వోలుగా పనిచేశామని, ఇప్పుడు మళ్లీ వీఆర్వో వ్యవస్థను తెస్తున్న నేపథ్యంలో పాత సర్వీస్‌ను కొనసాగించాలని కొందరు పూర్వ వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. రెండున్నరేండ్ల క్రితం జరిగిన సర్దుబాటు తర్వాత కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తాము అన్యాయం అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీలో గణితం చదివిన వారిని సర్వేయర్లుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. శాశ్వత నియామకమా? లేదా వీఆర్వోలుగా తీసుకొని డిప్యూటేషన్ ఇస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. వాస్తవానికి సర్వేయర్ల పోస్టులకు సాంకేతికంగా ఈ విద్యార్హత సరిపోదు. కాబట్టి భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా భూ భారతి బిల్లుతో తీసుకొచ్చే కొత్త వీఆర్వో వ్యవస్థ అటు ప్రజల్లోనే కాకుండా, ఇటు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లోనూ అనేక అనుమానాలను కలిగిస్తున్నది. వీటిపై అటు ప్రభుత్వం నుంచిగానీ, ఇటు రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత ఇవ్వడంలేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం రద్దుచేసింది కాబట్టి తాము ఏర్పాటుచేయాలనే మొండి పట్టుదల తప్ప ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్, డిగ్రీలో గణితం చదివిన వారిని సర్వేయర్లుగా నియమిస్తున్నట్టు తెలిపింది. అర్హత ఉన్నవారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నది. ఈ విద్యార్హతలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభు త్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 2017 జూన్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దీని ప్రకారం డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్‌మెన్ , ఇంటర్ వొకేషనల్‌లో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంఈ చేసినవారు అర్హులని పేర్కొన్నది. కానీ ప్రభు త్వం ప్రస్తుతం సర్వేయర్ పోస్టులకు మ్యా థ్స్ చదివిన వారిని ఎంపిక చేస్తుండటం చట్ట విరుద్ధమని స్పష్టంచేస్తున్నారు. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లో నిర్ణీత అర్హతలు ఉన్నవారిని తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు. మిగతా పోస్టులను టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.