Telangana | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): చెరువే తెలంగాణ ఆదరువు. ఊరుమ్మడి బతుకుదెరువు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా, చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి పాలననాటి గడ్డు పరిస్థితులను నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది. సాధారణంగా నేల లోపలి పొరలు, రాళ్ల స్వభావమే భూగర్భజలం లభ్యమయ్యే పరిస్థితులను, రీచార్జిని నిర్దేశిస్తుంటాయి. గట్టి రాతిపొరలు, నేలపొరలు ఉన్న ప్రాంతాల్లో నీరు నిలవడానికి, పారడానికి కావాల్సిన గుణాలు తకువ. ఇసుక రాతిపొరలు, వదులైన నేలపొరలు ఉన్నచోట భూగర్భజలాల లభ్యత ఎక్కువ.
నీటి రీచార్జి ప్రక్రియ సులభంగా, వేగంగా కొనసాగడమే అందుకు కారణం. తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే, రాష్ట్రంలో 80% గట్టి రాతిపొరలు ఉండగా.. గోదావరి బేసిన్లోనే ఇసుక రాతిపొరలున్నాయి. దానికితోడు రాష్ట్రంలో వర్షపాతం తకువ. 4 నెలలపాటే అత్యధిక వర్షపాతం ఉంటుంది. 8 నెలలు వర్షాలు ఉండవు. ఇక్కడ కుంభవృష్టి వానలు కురిసినా భూమిలోకి ఇంకేది మాత్రం 10 శాతానికి మించదని భూగర్భశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నీటిని ఒడిసిపట్టడంలో, భూగర్భజలాలను పెంచడంలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు తదితర నిర్మాణాలే అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కాకతీయులు వేలాది సంఖ్యలో చెరువులను నిర్మించారు.
నీటి వనరులను ఒడిసిపట్టారు. ఉమ్మడి పాలకులు ఆ చెరువులను విచ్ఛిన్నం చేయడంతోపాటు వ్యవస్థ మొత్తాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో తెలంగాణ పడావు పడ్డది. ఇది చరిత్ర. ఈ వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేయడంతోపాటు ఆకళింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తరువాత మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టారు.
అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భజల మట్టం పెరుగుతూ వచ్చింది. పంటలకు భరోసా లభించింది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయినా, అక్టోబర్ మొదటి వారం నాటికే చెరువులు అడుగంటడం ప్రారంభమైంది. గత పదేండ్లలో చూడని విభిన్నమైన పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 34,712 చెరువులు ఉండగా అక్టోబర్ నాటికే 13,211 చెరువుల్లో జలాలన్నీ అడుగంటిపోయాయి. 17,592 చెరువుల్లో 50% కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లోనే కొద్దిమేర జలాలు ఆశాజనకంగా కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నీ అడుగంటాయి. కొన్నిచోట్ల మాత్రమే చెరువుల్లో నీళ్లున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లగొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 90% చెరువులు దాదాపు అడుగంటి పోయాయి. మిగతా ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని చెరువుల్లోనూ కొద్దిమేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి.
డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలకుల తరహాలోనే చెరువులను ఈ ఏడాది నిర్లక్ష్యం చేసింది. చెరువులను నింపే పక్రియను పూర్తిగా విస్మరించింది. కారణం ఏమంటే నీటికొరత ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్న జవాబు. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే సాగునీరు అందని దుస్థితి నెలకొన్నది. ఈ ఏడాది నవంబర్ నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీలు, మిడ్‌మానేరులో 25, ఎల్ఎండీలో 23.42, ఎల్లంపల్లిలో 20.18, సింగూరులో 26.81, నిజాంసాగర్‌లో 17, కడెంలో 7, శ్రీశైలంలో 190, నాగార్జునసాగర్‌లో 305 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి.
అందులో కొద్దిమేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను కనీసం 50% నింపినా ఈ రోజు కరువు కోరల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తి ఉండేదని కాదని అధికారులు చెప్తున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్వతహాగా ఆ పనిచేయలేదు, అనుభవజ్ఞులైన అధికారులతోనూ చర్చించలేదు. నీరు అందుబాటులో ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని లిఫ్ట్ చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాల్లో పలుచోట్ల చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నీళ్లు వదిలింది.
కానీ, చెరువులను నింపాలనే ఆలోచన లేకపోవడమే ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యానికి అద్దం పడుతున్నదని అధికారులు, రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన కాలువల ద్వారా మాత్రమే కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లను ఇస్తున్నది తప్ప చెరువులకు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా చెరువుల కింద రెండో పంట సాగు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. వెరసి కృష్ణా బేసిన్‌తోపాటు గోదావరి బేసిన్లోనూ పరోక్షంగా పంటలు చేతికందని దుస్థితి నెలకొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే, ఆ బోరుబావులకు కావాల్సిన భూగర్భజలాల లభ్యతకు మళ్లీ ఆ చెరువులే ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చాయి. పూడికలు పెరిగినా భూగర్భజలాలు అడుగంటి పోవడం, కరెంటు కోతలతో యావత్ తెలంగాణ వ్యవసాయరంగం సంక్షోభానికి గురైంది. పదుల సంఖ్యలో, వందల అడుగుల్లో బోర్లు వేయడం, నీటి ఊటలేక అవి ఎండిపోవడం పరిపాటిగా మారింది.
రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల బోరుబావులు ఉండగా, వాటికింద సాగయింది 23 లక్షల ఎకరాలే. అది కూడా ఎప్పుడూ స్థిరంగా ఉన్నది లేదు. వానలు పడినా ఎండిపోవాల్సిన దుస్థితి. తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ అమలు చేసిన బహుముఖ జలసంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండుగలా మారింది.
దాదాపు 45 లక్షల ఎకరాలు 30 లక్షల బోర్లు కిందనే సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ, కాంగ్రెస్ పాలనలో మళ్లీ బోర్ల కింది సాగు సంక్షోభం దిశగా సాగుతున్నది. చెరువులను నింపకపోవడం వల్లే బోర్లన్నీ ఎండిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి కూడా అదే ప్రధాన కారణమని అర్థమవుతున్నది. ప్రభుత్వ అవగాహన రాహిత్యం ఫలితంగానే కరువు దాపురించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.