హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార తెలిపారు. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు, యానిమేషన్, గేమింగ్, విక్స్ఎఫ్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో డ్రై పోర్టుల ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పారుల్లో పారిశ్రామికవేత్తలకు చేసే భూ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెంచడమే లక్ష్యంగా నూతన ఎంఎస్ఎం పాలసీని తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు. తొమ్మిది జిల్లాల్లో నూతనంగా ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని తెలిపారు.