Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ప్రపంచబ్యాంకు విషకౌగిలిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ‘తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు సానుకూలంగా ఉన్నది’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొన్నాళ్లుగా పదేపదే చెప్తున్న మాట. ఇటీవల అమెరికా పర్యటనలోనూ ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో చర్చలు జరిపారు. హైదరాబాద్ 4.0, మూసీ ప్రక్షాళన, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగానికి అప్పులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలంటే సంక్షేమ రం గాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఆదాయ, వ్యయాలపై ప్రపంచబ్యాంకు గుత్తాధిపత్యం చెలాయిస్తుందని, వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టకూడదో ఆంక్షలు విధిస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బును ఎలా ఖర్చుచేయాలో నిర్దేశిస్తుందని అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ ‘ఆర్థిక’ సార్వభౌమాధికారాన్ని ప్రపంచబ్యాంకుకు తాకట్టు పెట్టడమేనని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో దాదాపు 20 ఏండ్ల తర్వా త ‘ప్రపంచబ్యాంకు’ అనే పేరు మళ్లీ వినిపిస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రపంచబ్యాంకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓ దశలో ప్రపంచబ్యాంకు అనేది ఊతపదంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నది. తిరిగి వాటిని చెల్లించేందుకు ప్రజలపై పన్నుల భారం వేసి ముక్కుపిండి వసూలు చేసిందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్ర మంలోనే కరెంటు చార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తే.. బషీర్‌బాగ్‌లో కాల్పుల వరకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ త ర్వాత వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ప్రపంచబ్యాంకుతో కలుగుతున్న నష్టాలను గుర్తించి, తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచబ్యాంకును ఆమడ దూరంలో ఉంచింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు శిష్యుడు/సహచరుడిగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి మళ్లీ ప్రపంచబ్యాంకును తెరమీదికి తెచ్చారని నిపుణులు అంటున్నారు.
ప్రపంచబ్యాంకు రుణాలు అంటేనే కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రైవేటీకరణ దాని ప్రధాన లక్ష్యమని, ప్రపంచబ్యాంకు నుంచి తీసుకునే రుణాలతో చేపట్టే ప్రాజెక్టులన్నీ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతి లో ఉండాల్సిందేనని అంటున్నారు. ఇక సంక్షేమ పథకాలకు ప్రపంచబ్యాంకు బద్ధ వ్యతిరేకి అని స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వా లు పేదలకోసం ఉచిత పథకాలు అమలు చేయొద్దని, ప్రతిదానికీ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేయాలన్నది దాని సిద్ధాంతమని పేర్కొంటున్నారు. రుణం ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆదా య వ్యయాలను ప్రపంచబ్యాంకు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. తీసుకునే అప్పును ఎలా ఖర్చుచేస్తారు? దాని నుంచి ఆదాయం ఎలా వస్తుంది? అప్పు, వడ్డీ కలిపి ఎలా చెల్లిస్తారు? అనే అంశాలను బేరీజు వేస్తుందని చెప్తున్నారు.
ఏటా రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను బేరీజు వేస్తూ వ్యయ నియంత్రణకు ఆదేశాలు ఇస్తుందని తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉండి, ఖర్చు ఎక్కువగా ఉంటే.. నిధుల విడుదలకు షరతులు విధిస్తుందని పేర్కొన్నారు. ఫలానా సంక్షేమ పథకంలో కోతలు విధించాలనో, లేదా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనో, లేదా పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలనో ఆదేశిస్తుందని చెప్తున్నారు. అమలు చేయకపోతే నిధుల విడుదలను ఆపడమే కాదు.. తీసుకున్న మొత్తం అప్పును కట్టాలంటూ పీకల మీద కూర్చుంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో వాటిని తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం అంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడమే అని హెచ్చరిస్తున్నారు. ఇక బ్యాంకు నిధులను ప్రజాసేవకో, ఉచిత పథకానికో అమలు చేస్తామంటే ఒక్క రూపాయి కూడా విదిల్చదని స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచబ్యాంకు విధానాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌కు వ్యతిరేకంగా అనేక ఆఫ్రికా దేశాల్లో ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నైజీరియాలో ఇటీవల 2.25 బిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం కోసం, ఆ దేశ అధ్యక్షుడు బోలా తినుబు పెట్రోల్ సబ్సిడీలను, విద్యుత్తు సబ్సిడీలను తగ్గించారు. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా కార్మిక సం ఘాలు సమ్మె మొదలుపెట్టాయి. ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ‘నైజీరియాను స్వేచ్ఛగా వదిలేయండి’ అంటూ నినాదాలు చేశారు. కెన్యాలోనూ ఇదే పరిస్థితి. ‘ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్.. కెన్యాను మీ కబంధ హస్తాల నుంచి విడిచిపెట్టండి’ అంటూ ప్రజలు రాజధాని నైరోబీలో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని, పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని, వాతావరణ మార్పులతో విపత్తులు తలెత్తుతున్నాయని అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీలు, 400కు పైగా హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్తున్నది. మిగతావాటిని కూడా కచ్చితంగా అమలు చేస్తామంటూనే.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, కిస్తీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తున్నదని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం అంటే.. సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సిందేనన్నది నిపుణుల మాట. ఓవైపు డబ్బులు లేవని బీద అరుపులు అరు స్తూ, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రపంచబ్యాంకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పథకాల్లో కోతలు విధిస్తేనే రుణాలు దక్కుతాయని చెప్తున్నారు. రాష్ట్రంలో మూసీ రివర్ ఫ్రంట్, స్కిల్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ 4.0, వైద్యారోగ్య రంగానికి సాయం చేసేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చిందని ప్రభుత్వం చెప్తున్నది. మొదటి మూడు ప్రాజెక్టులు ప్రపంచబ్యాంకు నిబంధనలకు తగ్గట్టే పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నట్టు ఇప్పటికే స్పష్టత వచ్చిందంటున్నారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అంటే.. సమీప భవిష్యత్తులో ప్రజలకు ఉచితంగా వైద్యం అందదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిబంధనల ప్రకారం ఆదాయం చూపించాలని, ప్రజారోగ్యంలో ఆదా యం ఎలా చూపిస్తారని అడుగుతున్నా రు. ఈ లెక్కన మళ్లీ యూజర్ చార్జీలు తెరమీదికి తెస్తారని అనుమానిస్తున్నారు. ఓవైపు అభయహస్తం అంటూనే.. మరోవైపు ప్రపంచబ్యాంకు రుణం కోసం పాకులాడుతూ రాష్ర్టాన్ని కబంధ హస్తాల్లోకి నెడుతున్నారని మండిపడుతున్నారు.