ఆరు గ్యారెంటీల పేరిట ఊరించి ఉసూరుమనిపించి, ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటూ ఓ ప్రహసనాన్ని పండించిన కాంగ్రెస్; ఇపుడు మరో మహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఈసారి గాంధీ మహాత్ముడిని.. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని.. రాజ్యాంగాన్ని కూడా తన నినాద చట్రంలో ఇరికించి పార్టీ జాతీయ అధ్యక్షుడి నేతృత్వంలో సభ పెట్టి కొత్త నాటకానికి తెరతీయనుంది.
అయితే, ఎటొచ్చీ తమకు ఇంటావంటా అలవాటులేని, ఏనాడూ ఆచరించని ఈ నినాదాలను వల్లించడమే విచిత్రం. గత ఏడాదిన్నర కాలంలో ఈ నినాదాలను ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఆచరించిందా? అనుసరించిందా? అన్నదే ప్రశ్న.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రవచిస్తున్న గాంధేయవాదం మాటల్లో తప్ప చేతల్లో ఎన్నడూ కానరాదు. గడచిన 18నెలల కాంగ్రెస్ పాలనే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం పల్లెలను పూర్తిగా విస్మరించింది. స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినా ఇప్పటికీ ఎన్నికలను నిర్వహించలేదు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో 2019-2024 వరకు ఫిబ్రవరి వరకు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రూ. 1,200 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదు. గాంధీ చెప్పిన గ్రామం స్వరాజ్యం అంటే ఇదేనా? మద్య నిషేధాన్ని అమలు చేయాలని గాంధీ కోరితే కాంగ్రెస్ మాత్రం ఖజానా నింపుకొనేందుకు ‘తాగండి, ఊగండి, ఖజానాను నింపండి’ అన్న చందంగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. మద్యం అమ్మకాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.27,623 కోట్ల ఎక్సైజ్ ఆదాయం ఆర్జించాలని ప్రతిపాదించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 2,006 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.
రాష్ట్ర బడ్జెట్లో17 శాతం ఎక్సైజ్ రాబడి ద్వారానే సమకూరే విధంగా అంచనాలు రూపొందించారు. అలాగే, వ్యాట్ ద్వారా ఈ ఏడాది రూ. 22,570 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తంగా రూ 50 వేల కోట్ల విలువైన మద్యం వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరోవైపు, ప్రజాస్వామ్యాన్ని కూడా కాంగ్రెస్ అడ్డగోలుగా ఖూనీ చేస్తున్నది. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్కు చెందిన 10మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఏకంగా తమ పార్టీ తరపున ఎంపీ టికెట్ కేటాయించింది. గాంధీ ప్రజాస్వామ్య భావననే కాదు, కాంగ్రెస్ ఆరాధ్య నాయకుడు రాజీవ్‌గాంధీ చేసిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సైతం కాంగ్రెస్ ఏలికలు తుంగలో తొక్కుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు అనేక మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడే కాదు ఏనాడూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ చాటుకోలేదు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం ఇందిరాగాంధీ హయాం నుంచే ప్రారంభమైంది.
పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసులపై బుల్డోజర్తో విరుచుకుపడుతున్న ప్రభుత్వం
కాంగ్రెస్ చాలా విచిత్రంగా సామాజిక న్యాయం కోసం జీవితమంతా పోరాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను తలకెత్తుకుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అర్హత ఉందా? ఆయన జయంతి రోజున సచివాలయం సమీపంలోనే ఉన్న అంబేద్కర్ మహా విగ్రహానికి పూలమాల కూడా వేయరు. ఆయన బోధించిన సామాజిక న్యాయాన్ని మంత్రివర్గంలోగానీ నామినేటెడ్ పదవుల్లో గానీ ఈ ప్రభుత్వం అమలు చేయదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పార్టీలో ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యముండదు. దళితులకు పార్టీలో విలువ లేదు దళితులకోసం పెట్టిన దళితబంధు పథకాన్నే ఎత్తేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన గురుకులాలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక న్యాయం. కానీ కాంగ్రెస్ గడచిన 18 నెలల కాలంలో సామాజిక న్యాయాన్ని పాటించిన దాఖలాల్లేవు. పేరుకే సామాజిక న్యాయం, కానీ ఆచరణలో మొత్తంగా ఆధిపత్య వర్గాలదే పెత్తనం.
ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసి 23 సీట్లకే పరిమితం చేసింది. అత్యధిక స్థానాలకు రెడ్డి సామాజికవర్గానికే కేటాయించింది. నామినేటెడ్ పదవులను, ప్రభుత్వశాఖల్లో, సెక్రటేరియట్లో, సీఎం పేషీలో కీలక స్థానాలన్నీ ఒక సామాజిక వర్గానికే కట్టబెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు, ఉద్యోగులకు ఎక్కడా కనీస చోటు కల్పించలేదు. అంబేద్కర్ స్ఫూర్తిని చాటుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ విగ్రహానికి ఒక్క పూలమాల కూడా వేయలేదు. దళిత వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దళితుల జీవనోపాధి కోసం రూ.10 లక్షలు అందించింది. దానికి అదనంగా మరో రెండు లక్షలు కలిపి రూ. 12 లక్షలను అంబేద్కర్ అభయ హస్తం పేరిట అందిస్తామని కాంగ్రెస్ ప్రగల్భాలు పలికింది. కానీ ఉన్న పథకాన్ని అటకెక్కించింది. బీసీ బంధును, మైనార్టీ బంధును బంద్ పెట్టింది. అట్టడుగువర్గాలకు విద్య అందించాలని అంబేద్కర్ ప్రవచిస్తే ఉన్న గురుకులాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నది. ఎస్సీ గురుకుల సొసైటీలో ఈ ఏడాది ఏకంగా 12 గురుకులాలను మూసివేయడమే అందుకు నిదర్శనం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కొనసాగించాలని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు, దళితులు
రాహుల్‌గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకు తిరుగుతున్నారు కాబట్టి ‘జై సంవిధాన్’ అన్నట్టుంది గానీ, అసలు కాంగ్రెస్ పార్టీకి సంవిధాన్ అనే వ్యవస్థ మీద ఏనాడన్నా నమ్మకం ఉన్నదా? ఆ మాటకొస్తే రాజ్యాంగాన్ని అటకెక్కించి దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది ఈ పార్టీయే కదా? పోనీ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏ మాత్రమైనా అనుసరించిందా? రాజ్యాంగ విలువల మీద ఈ సర్కారుకు గౌరవం ఉన్నదా? అంటే.. అదీ లేదు.
రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన అత్యంత ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ ప్రధానమైనవి. దీనిని సైతం కాంగ్రెస్ కాలరాస్తున్నది. 18 నెలల పాలనే ఇందుకు నిదర్శనం. చట్టాలను అతిక్రమించి, రాజ్యాంగ నిబంధనలన్నీ తుంగలో తొక్కి హైడ్రా పేరిట ఆరాచకాన్ని సృష్టిస్తున్నది. హైకోర్టు స్టే ఉన్నా సున్నం చెరువు వద్ద పేదల ఇండ్లనే లక్ష్యంగా కూల్చివేతలకు పాల్పడుతున్నది. చెరువుల పునరుద్ధరణ మాటున పేదల బతుకులను రోడ్డు పాలు చేస్తున్నది. బుల్డోజర్ పాలనను సాగిస్తున్నది. ప్రాజెక్టులకు భూసేకరణ పేరిట మరో దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నది. భూములివ్వబోమని అడ్డం తిరిగిన బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులపై దాడులకు తెగబడుతున్నది. సీఎం సొంత నియోజకవర్గం కొండగల్‌లో లగచర్ల ఉదంతమే ఒక నిదర్శనం. ట్రిపుల్ ఆర్ రైతులపైనా ఇదే వరుస. చట్టాలను, హైకోర్టు తీర్పులను ఉల్లంఘించి బలవంతపు భూసేకరణకు దిగుతున్నది.
తమది ప్రజా పాలనని, ప్రజల వద్దకు పాలన అంటూ నిత్యం గొప్పలు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రశ్నను కూడా తట్టుకోలేకపోతున్నది. వాట్సాప్‌లో షేర్ చేసినా, ఎక్స్‌లో పోస్టు పెట్టినా, ఫేస్బుక్లో కామెంట్లు చేసినా చూసి తట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్ర నాయకత్వం నుంచి కిందిస్థాయి కేడర్ వరకూ ఎక్కడో ఓ చోట ఫిర్యాదు చేయించి కేసులు బుక్ చేయడమే పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులు, ఆఖరికి సాధారణ పౌరులు ప్రశ్నించినా, ఆవేశంలో మాట తూలినా కేసులు నమోదు చేస్తున్నారు. ‘నిరసన’, ‘ఆందోళన’, ‘ధర్నా’ చేపట్టినా అణచివేస్తున్నారు. మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ పాటించ లేదని అన్నందుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ తగలబెట్టారని మాజీ మంత్రి జోగు రామన్నపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నోరెత్తితే, విమర్శిస్తే, ఇదేంటని ప్రశ్నిస్తే.. కేసుల మీద కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ‘జై సంవిధాన్’ అనడం విడ్డూరమే!