BBB | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటీవలే పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తనకు ఎదురైన అనుభవాన్ని సదరు ఎమ్మెల్యే కనిపించిన వారందరితో చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. చేసిన పనులకు బిల్లులు కావాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందేనని, లేదంటే బిల్లులను మర్చిపోవాల్సిందేనని ప్రభుత్వ పెద్ద ఒకరు హుకుం జారీచేశారట. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే వియ్యంకుడి బిల్లుల చెల్లింపుల విషయంలో ఇలా బెదిరించినట్టు తెలిసింది.
ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతాం అంటే మీ ఇష్టమని తేల్చి చెప్పడంతో సదరు ఎమ్మెల్యే రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ‘నువ్వు నా సొంత జిల్లా మనిషివి. నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ ఉంటే ప్రయోజనం ఏమిటి? నేను తలచుకుంటే కాలు తీసి కాలు కదపలేవు. రాజకీయాలు చేయాలంటే ఇటు రావాల్సిందే.
లేదంటే దందా బంద్’ అని ఫత్వా జారీ కావడంతో అనేక తర్జనభర్జనలు పడి చివరికి పార్టీ మారాల్సిన అనివార్యత నెలకొనడంతో మరో నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారని ఆ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ‘పార్టీలో చేరుతావా? లేదంటే ఫలానా కేసులో లోపల తోయాలా?’ అని ఓ ఎమ్మెల్సీకి బెదిరింపు వర్తమానం చేరగానే ఆయన పార్టీ మారారని ప్రచారం సాగుతున్నది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ పార్టీ ‘బీ క్యూబ్'(బిల్లు, భూమి, బ్లాక్మెయిల్) ఫార్ములాను ప్రయోగిస్తున్నదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 64 సీట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. శాసనసభలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉన్నది. శాసనమండలిలోనూ బీఆర్ఎస్కు ఏకపక్ష మెజార్టీ ఉంది. అధికార పార్టీకి ఇది తలనొప్పిగా మారింది. దీంతో బీఆర్ఎస్ను అటునుంచి నరుక్కొచ్చి బలహీనపరిచే వ్యూహాన్ని రచించినట్టు తెలిసింది.
నిర్దేశించుకున్న చేరికల లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగెస్ పార్టీ ‘బీబీబీ’ వ్యూహాన్ని రచించిందని, పార్లమెంటు ఎన్నికల సమయంలో దానిని ప్రయోగించిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ‘భూ’ ఆరోపణలను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీని, ఒక ఎమ్మెల్యేను చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించిందని రాజకీయ వర్గాల్లో అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అలా పోటీలోకి దిగిన ఇద్దరూ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వ్యాపారరంగంలో ఆరితేరిన ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు అదే తరహా బెదిరింపులు వెళ్లాయని ప్రచారం జరుగుతున్నది. ‘బీఆర్ఎస్లో ఉంటే లాభం లేదు. ఇటొచ్చెయ్. పార్టీలో చేరగానే ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాం’ అని సదరు ఎమ్మెల్యేకు ఆఫర్ ఇస్తే, ఆ ఎమ్మెల్యే ససేమిరా అని మొండికేశారని అప్పట్లో విస్తృతంగా ప్రచారం సాగింది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకొనేందుకు అనుసరిస్తున్న బీక్యూబ్ ఫార్ములాను పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తృతంగా ప్రయోగిస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంలో ఒక వ్యవస్థే ఏర్పడినట్టు సమాచారం. అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకోవడం, వాయిదా పద్ధతుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వంటి పరిణామాలు అందులో భాగమేనని చెప్తున్నారు. ఆ ప్రచారం నిజమేనని చేరికలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పండితులు ఉదహరిస్తున్నారు.
ఆ ఫార్ములాను అనుసరించే ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని, నేడో రేపు మరో ఇద్దరు ముగ్గురు చేరబోతున్నారని అంటున్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే రోజువారీ ‘లక్ష’ణమైన సంపాదనకు గండికొడతామనే బెదిరింపులు రావడం, సదరు నేత కొడుకు రాజకీయ భవిష్యత్తును లేకుండా చేస్తామని గట్టి హెచ్చరిక రావడంతో ఆ నేత కాంగ్రెస్‌పార్టీ కండువా కప్పుకొని జాగ్రత్త పడ్డారనే ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బీబీబీ విధానాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నదే తప్ప ప్రజామోద నిర్ణయాలు తీసుకొని పాలన సాగించాలని అనుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.