హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): దుబ్బాక నియెజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకొనేది లేదని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అక్బర్పేట-భూంపల్లి మండలం దర్పల్లిలోని 294 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.
గతంలో ఎస్సీ కమిషన్ ద్వారా ప్రభుత్వం సేకరించిన భూమి ఎలా పట్టాగా మారిందని ప్రశ్నించారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన భూమిని కొనుగోలు చేశారని మండిపడ్డారు. కొందరు బడా బాబుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు వెళ్లాయని ఆరోపించారు. గతంలోనే ఈ భూములపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేశామని తెలిపారు. ఎనెగుర్తిలోనూ పెద్ద ఎత్తున భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దర్పల్లి భూ అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయిస్తామని తెలిపారు. ధరణి ద్వారా జవాన్ భూమిని మార్పిడి చేసి కబ్జా చేశారని, జవాన్ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.