Congress | ఒక్కొక్క రైతుపై ఉన్నపళంగా కనీసం రూ.1.10 లక్షల ఆర్థికం భారం మోపి, వారిని అప్పుల ఊబిలోకి ఈడ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదా? రాష్ట్ర రైతాంగంపై ఏకంగా రూ.30,000 కోట్ల భారం మోపి వారిని రుణగ్రస్థులుగా మార్చడమే ఎజెండాగా పెట్టుకున్నదా? పొలాల్లో, బాయిలకాడ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఇలాంటి అభిప్రాయమే కలుగుతున్నది. తమపై కాంగ్రెస్ ఎందుకు ఇంతలా కక్ష కడుతున్నదని రైతులు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర రైతాంగంపై ఏకంగా రూ.30,000 కోట్ల భారం పడుతుంది. మోటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసమే ఒక్కొక్క రైతు కనీసం రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెకానిక్, కూలీల కోసం మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రైతాంగం ఇంత భారం మోయగలదా? అసలు రైతులు ఎందుకు ఈ భారాన్ని మోయాలి? దీనివల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఏ ప్రభుత్వమైనా ప్రజల కష్టాలను తొలగించే పథకాలను అమలుచేయాలి. కానీ, కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నది.
రైతుల నెత్తిన భస్మాసుర హస్తం మోపే విధానాలను ఎజెండా మీదకు తెస్తున్నది. వ్యవసాయానికి కేవలం 3 గంటలపాటు విద్యుత్తు ఇస్తే సరిపోతుందని, అందుకు ప్రతి రైతూ 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్ల స్థానంలో 10 హెచ్పీ మోటార్లు కొనుగోలు చేయాలని వాదిస్తున్నది. వ్యవసాయం గురించి ఏమీ తెలియని కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలను నమ్మితే తెలంగాణ రైతాంగం ఇక్కట్ల పాలవుతారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. మౌలిక, నిర్మాణ, పారిశ్రామికరంగాల్లో అత్యధికంగా వినియోగించే 10 హెచ్పీ మోటర్లను వ్యవసాయానికి వాడాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి రైతులు 10 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేస్తే అది తలకు మించినభారంగా మారడం ఖాయం. మార్కెట్లో లభించే నాణ్యమైన సీఆర్ఐ, టెక్స్మో, సముద్ర, లూబీ, ఎల్లెన్, కిర్లోస్కర్ లాంటి బ్రాండెడ్ 10 హెచ్పీ మోటర్ల సగటు ధర సుమారు రూ.50 వేల వరకు ఉన్నది. వీటితోపాటు పైపులు, క్లాంప్లు, వైర్లు, డబ్బా, స్టార్టర్లకు మరో రూ.50 వేలకుపైగా ఖర్చు అవుతుంది. బోరు లోతు ఎక్కువగా ఉంటే పైపులు, వైర్లకు అయ్యే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటిని బిగించడానికి మెకానిక్, ఇద్దరు కూలీల ఖర్చు అదనం.
ఈ లెక్కన సగటు ధరలను పరిగణనలోకి తీసుకున్నా రూ.1.10 లక్షలకుపైగా ఒక్కొక్క రైతుపై భారం పడక మానదు. అంటే సగటున ఒక్కో రైతుపై రూ.1.10 లక్షలకుపైగా భారం మోపి, వారిని అప్పుల పాలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహం పన్నుతున్నట్టు అర్థమవుతున్నది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ.. 24 గంటల ఉచిత విద్యుత్తుతో బోర్లు, బావుల్లో ఉన్న భూగర్భ జలాలను వినియోగించుకుంటూ.. రెండేసి పంటలు పండిస్తూ.. వ్యవసాయాన్ని పండుగలా జరుపుకుంటున్న తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇంతగా కక్ష కడుతున్నారో అర్థంకాని పరిస్థితి.
రైతులు 10 హెచ్పీ మోటర్లను వినియోగిస్తే 3 గంటల విద్యుత్తు సరిపోతుందని, అందుకు రైతులు సిద్ధంగా ఉండాలంటూ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు అప్పుడే హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీనితో తెలంగాణ రైతుల గుండెల్లో ఫిరంగులు పేలుతున్నాయి.
ఇంత కష్టపడి 10 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేస్తే.. రైతులకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంటే అదీలేదు. 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లను పక్కనపెట్టి 10 హెచ్పీ మోటర్లు బిగించడం వల్ల పంట దిగుబడి పెరిగేదేమీ ఉండదు. ఆదాయంలో ఎటువంటి మార్పూ ఉండదు. కాబట్టి చేతి చిలుము వదిలించుకోవడం తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదు. రైతులకు ఏ మాత్రం మేలు చేయని 10 హెచ్పీ మోటర్ల కోసం అదనపు భారం మోపేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.
కాంగ్రెస్ నేతలెవరూ వ్యవసాయం చేస్తున్నట్టుగా లేదు. అందుకే ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా రైతులపై భారం పడకుండా లాభం కలిగించే పథకాలను ప్రవేశపెట్టాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం రైతులపై భారం వేయడానికే 10 హెచ్పీ మోటర్లు, 3 గంటల కరెంటు అనే తలతిక్క ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. స్వయంగా వ్యవసాయం చేస్తున్న సీఎం కేసీఆర్ ఇందులోని దుర్మార్గాన్ని రైతులకు వివరిస్తున్నారు. ఇది కొంపలు ముంచే యవ్వారం అని హెచ్చరిస్తున్నారు. ఒక్క ధాన్యపు గింజ ఉత్పత్తిని కూడా పెంచకపోగా ఒక్కో రైతుపై అదనంగా రూ.1.10 లక్షల భారాన్ని మోపి, రుణగ్రస్తులగా మార్చే కుట్రలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడకాయపై తలకాయ ఉన్నోడెవడైనా.. ఇలాంటి చచ్చుమాలిన పథకాన్ని చెప్తారా? అని మండిపడుతున్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే లక్షలు ఖర్చు పెట్టి 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాల్సి వస్తుందని, నిక్షేపంగా పనిచేస్తున్న ప్రస్తుత మోటర్లను తక్కు సామాను కింద అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నాయకులైనా, ప్రభుత్వమైనా రైతులకు సాయం చేయాలే తప్ప వారిపై పెనుభారం వేయడం ఏమాత్రం తగదు. రైతులపై భస్మాసుర హస్తంలా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పన్నాగాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రను తిప్పి కొట్టాలి.
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. ప్రతి రైతూ 10 హెచ్పీ మోటర్లను కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 28 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. కాంగ్రెస్ మాటలు నమ్మితే వీటన్నింటినీ తొలగించి 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు 28 లక్షల 10 హెచ్పీ మోటర్లు దొరకడం కష్టం.
పోనీ కిందా మీద పడి అందుబాటులో ఉన్నవాటిని కొనుగోలు చేద్దామన్నా ఒక్కో మోటరు పంపుసెట్కు రూ.1.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మోటర్లు కొనుగోలు చేయాలంటే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భారాన్ని ఎవరు మోయాలి? రైతులేగా. ఒక్కసారిగా రూ.1.10 లక్షల భారాన్ని మోయగల రైతులెంతమంది?