హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : వర్సిటీల్లోని కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గురువారం ఒక ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థులను కూడా మోసం చేసిందని దుయ్యబట్టారు. విద్యా బోధన చేసేవారిని మోసం చేసి, ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుని, పోస్టులను వెంటనే క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో పార్ట్‌టైమ్ టీచర్లకు అనుభవం ప్రకారం వెయిటేజ్ కల్పించి, తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. హామీ నెరవేర్చాలని అడిగితే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కాంట్రాక్ట్ టీచర్ల సమస్యను పరిషరించి, అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.