Congress | గద్వాల టౌన్, నవంబర్ 20: ‘తోలు తీస్తా.. పాతాళంలోకి తొక్కేస్తా.. నాతో పెట్టుకుంటే ఖబడ్దార్.. వారం రోజుల్లో మూటాముళ్లే సర్దుకొని పోవాల్సిందే’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత, ఆమె భర్త తిరుపతయ్య బీఆర్ఎస్ గద్వాల అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఉద్దేశించి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. గొప్ప చదువులు చదివానని, సమాజంపై బాగా అవగాహన ఉందని చెప్పుకొనే సరిత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి నోట.. ‘గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు మొదలయ్యాయి.. ప్రశాంతంగా ఉన్న గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి చిచ్చు పెట్టేందుకు వచ్చినట్టు ఉంది. ఇంత అహంకారం పనికి రాదు. ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు అటో.. ఇటో అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి’ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం.
కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి, నాయకులు.. బీఆర్ఎస్పైనే కాకుండా ఎమ్మె ల్యే, ఆయన సతీమణి బండ్ల జ్యోతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. బండ్ల జ్యో తిని ఉద్ధేశించి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి సరిత అన్న మాటలు గద్వాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. ప్రస్తు త ఎమ్మెల్యేను ఆయన కుటుంబాన్ని గద్వాల నుంచి గెంటివేస్తామంటున్న కాంగ్రెస్.. రేపటి రోజు సామాన్య ప్రజలను ఎలా పట్టించుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశమిస్తే ప్రజలు, వారి ఆస్తులకు భద్రత ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆమె మాట్లాడి 24 గంటలు కూడా దాటక ముందే.. మల్దకల్ మండలం పెద్దపల్లి బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేస్తూ పిడిగుద్దులు గుద్దిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.