మోదీ రాష్ర్టానికి రావడానికి రెండు రోజుల ముందు.. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోదీ రావడానికి ఒకరోజు ముందు.. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లారు. రేవంత్ ప్రెస్‌మీట్ పెట్టి ‘తెలంగాణ ఆత్మగౌరవం’ నినాదం ఎత్తుకున్నారు.
Congress-BJP | హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలను విశ్లేషిస్తుంటే లోక్‌సభ ఎన్నికల ప్రచారక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉండాలని, కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను తప్పించాలని చేసిన కుట్ర అని స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ బస్సుయాత్రతో తమ అంచనాలన్నీ తలకిందులు కావడంతో రెండు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి ‘నువ్వు తిట్టినట్టు చెయ్యి.. నేను ఏడ్చినట్టు చేస్తా’ అనే తరహాలో రాజకీయం మొదలు పెట్టాయని అంటున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ డూప్‌ఫైట్
రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావడం, బీఆర్ఎస్కు దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక.. కాంగ్రెస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెరలేపాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘ఉంటే నేను ఉండాలి, లేదంటే నువ్వు ఉండాలి’ అని నిర్ణయించుకున్నట్టు కనబడుతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యలు వంటివి ప్రస్తావిస్తే తమకు మొదటికే మోసం వస్తుందని గ్రహించి, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ‘డూప్‌ఫైట్’తో ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టాయని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ ప్రచారం మొదలుపెడితే, తనను పదవి నుంచి దింపే కుట్ర చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి సానుభూతి పొందే వ్యాఖ్యలు చేశారని గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత రామాలయం నిర్మించామని బీజేపీ ప్రచారం చేస్తే, ‘రాముడికి మొక్కాలి, బీజేపీని తొక్కాలి’ అంటూ కాంగ్రెస్ కొత్త రాగం ఎత్తుకున్నదని వివరిస్తున్నారు.
రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఆర్జీ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తుంటే, తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు ఇచ్చారంటూ రేవంత్‌రెడ్డి విమర్శిస్తున్నారని ఉదహరిస్తున్నారు. అయినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఫేక్/మార్ఫింగ్ వీడియోల నాటకం తెరమీదికి తెచ్చారని అంటున్నారు. ఫేక్ వీడియోలను టీపీసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లారు.
దీంతో ఈ అంశాన్ని గుజరాత్ అహంకారానికీ, తెలంగాణ పౌరుషానికి మధ్య పోరాటంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి, మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకునిగా చేసినవే తప్ప కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అధికారికంగా చేసినవి కావు.
కానీ, అమిత్‌షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు హైదరాబాద్‌కు వచ్చి రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడం పెద్ద డ్రామా అని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ స్వయంగా ఆరోపణలు చేస్తే, బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
కేసీఆర్‌ను దూరం చేసేలా కుట్ర
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తాము మాత్రమే ఉండాలని, ప్రజలు తమ గురించి మాత్రమే ఆలోచించాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసిన ప్రయత్నాలు విజయం సాధించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు కేసీఆరే ప్రధాన కారణమని అంటున్నారు. కేసీఆర్ తన యాత్రలో మొత్తం ప్రజా సమస్యల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
రైతుల ఆత్మహత్యలు, రైతుబంధు రాకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడం, విద్యుత్తు సరఫరాలో ఆటంకాలు, కాలువలకు సాగునీటి విడుదలలో నిర్లక్ష్యం వంటి ప్రజా సమస్యలపైనే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎలా దోఖా చేసిందో ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిన అన్యాయాలను సైతం ఎండగడుతున్నారు.
మోదీ ఇచ్చే పెద్ద పెద్ద నినాదాలు మాటలకే తప్ప, ఆచరణలో కనిపించడం లేదని ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసేందుకు రెండు పార్టీలు కుట్ర పన్నాయని విశ్లేషిస్తున్నారు.
రైతుభరోసా యాత్రలో భాగంగా సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో పోల్చితే కేసీఆర్ వ్యాఖ్యల తీవ్రత చాలా తక్కువని అంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచి పెడతారనే అర్థం వచ్చేలా మోదీ వ్యాఖ్యానించారని గుర్తుచేస్తున్నారు.
ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. 1987లో శివసేన అధినేత, దివంగత బాల్‌ఠాక్రే ఒక ప్రచారసభలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఆరేండ్లపాటు ఎన్నికల ప్రచారానికి దూరం చేయడంతోపాటు ఓటు వేయకుండా నిషేధం విధించిందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
కానీ, ఇప్పుడు మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు కేసీఆర్‌ను ఉద్దేశించి ‘పేగులు మెడలో వేసుకుంటా’, ‘గుడ్లు పీకేస్తా’ వంటి అనేక వ్యాఖ్యలు చేసినా వినపడనట్టు ఈసీ ప్రవర్తిస్తున్నదని మండిపడుతున్నారు. కానీ, కేసీఆర్‌పై మాత్రం కక్ష కట్టినట్టుగా చర్యలు తీసుకున్నారని, దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ గూడుపుఠాణీ ఉన్నదని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి, కేసీఆర్ సిరిసిల్ల పర్యటన ఎన్నికల ప్రచారం కోసం కాకుండా, పంటలు ఎండిపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు చేపట్టారు. ఒక సందర్భంలో మీడియా ప్రతినిధులు ఎన్నికల గురించి ప్రశ్నలు అడుగగా ‘నేను ఇక్కడికి ఎన్నికల ప్రచారం కోసం రాలేదు. తర్వాత మాట్లాడుతాను’ అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేస్తున్నారు.
బస్సుయాత్రలో భాగంగా ఇప్పటివరకు కేసీఆర్ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల ‘కేసీఆర్ రాకముందు.. కేసీఆర్ ప్రచారం తర్వాత’ అనే స్థాయిలో స్పష్టంగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో యాత్ర కీలక దశకు చేరుకున్న దశలో కేసీఆర్‌ను ప్రచారపర్వానికి దూరం చేసేందుకే నిషేధం పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ రాకతో పరిస్థితి తలకిందులు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ పనైపోయిందని కాంగ్రెస్, బీజేపీ భావించాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు ఎదురులేదని కాంగ్రెస్ అనుకోగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని తాము ఆక్రమిస్తామని బీజేపీ ఆశలు పెంచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎదురు ఉండదని, చెరికొన్ని సీట్లు పంచుకోవచ్చని లెక్కలేసుకున్నాయి.
కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఉద్యమ కాలంనాటి కేసీఆర్ కనిపిస్తడు’ అని ప్రకటించి, దానికి తగ్గట్టుగానే పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారు. రైతులు, మైనార్టీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలూ తిరిగి బీఆర్ఎస్ వైపు చూడటం మొదలుపెట్టాయి.
ముఖ్యంగా ‘బీజేపీకి బీ టీమ్’ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని నమ్మి బీఆర్ఎస్కు దూరమైన మైనార్టీలకు.. అది దుష్ప్రచారమని అర్థం కావడంతో ఆలోచన ధోరణి స్పష్టంగా మారినట్టు కనిపిస్తున్నది. ఫలితంగా ఎన్నికల రణక్షేత్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10-12 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మెజార్టీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడో స్థానాలకు పరిమితమవుతాయనే అంచనాలున్నాయి.