రఘునాథపాలెం, సెప్టెంబర్ 18: కాంగ్రెస్‌లోకి రావడంలేదనే కారణంతో ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. బాధితుడు చీటిక వినయ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా దానవాయిగూడెంనకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చీటిక వినయ్‌ను తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆరు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. అతడు నిరాకరించడంతో అక్రమ కేసులు పెడుతున్నారు. కాలనీలోని వినాయక మండపం వద్ద సోమవారం కొందరు యువకులు దాడులు చేసుకున్నారు. అయితే వినయ్ ప్రమేయంతోనే దాడులు జరిగినట్టు మంగళవారం ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్‌లో కొందరు తప్పుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలవడంతో వినయ్ మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకున్న అదే కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణ, సందీప్, ఈశ్వర్, సైదులు వినయ్ ఇంట్లోకి చొరబడి వస్తువులు, కిచెన్ సామగ్రిని ధ్వంసం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినయ్ ఫిర్యాదు చేస్తే సీఐ ఫిర్యాదు తీసుకోలేదు. పైగా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఓ ఖాళీ కాగితం తీసుకొచ్చి వినయ్‌తో బలవంతంగా సంతకం తీసుకున్నాడు.