వరంగల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడుతుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం దాలుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై చంద్రబాబు టీం అదే పార్లమెంట్ వేదికగా విషం కక్కుతుంటే, బల్లలు చరుస్తూ సంబురపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సగర్వంగా నిలబడి 13 ఏండ్లు కావస్తున్నా, ఇంకా రాష్ట్ర ఏర్పాటు రోజును పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ ఒకరు బ్లాక్‌డేగా అభివర్ణిస్తుంటే, పగలబడి నవ్వుతూ ఆ వ్యాఖ్య తమది కాదన్నట్టుగా పరాధీనతను ప్రదర్శిస్తున్నారు. మట్టిపనికైనా ఇంటోడు ఉంటే ఎట్లా ఉంటుందో మూడు రోజుల క్రితం రాజ్యసభ వేదికగా బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి రుచిచూపించారు. మరోవైపు, రాష్ట్రం నుంచి ఎంపీ గా గెలిచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి మా త్రం తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టేలా, ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా నోరుపారేసుకున్నారు.
‘ఇంటోడుపోయి మందిల కలిస్తే కొసాఖరికి ఇల్లు గుల్ల’ అన్నట్టుగా తెలంగాణ నుంచి ఎన్నికైన 16 మంది ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాటం చేయకపోగా ‘దొంగలకు సద్దిగట్టిన’ చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 8 మంది బీజేపీ ఎంపీలు నోటికి తాళం వేసుకోవడమే కాకుండా అడ్డగోలుగా విషం కక్కుతున్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రం, కేంద్రంలో బీజేపీ జపం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి సీఆర్ పాటిల్ తన అక్కసు వెళ్లగక్కగా, మరో మంత్రి కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా పార్లమెంట్లో అడ్డగోలు అబద్ధాలు అలవోకగా ఆడారు. పైగా పోలవరం ప్రాజెక్టు పేరుతో 7 మండలాలు ఏపీకి ధారాదత్తమైంది రాష్ట్ర విభజన బిల్లులోనే అంటూ మరో అసత్య సూత్రీకరణ చేశారు.
తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ముఖ్యమా? అనే చర్చ సాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కన్నా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే మిన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం నుంచి కొత్త హామీలను పొందకపోగా కనీసం విభజన చట్టంలోని అంశాలపై మాట మాత్రంగానైనా ప్రయత్నం చేసిన దాఖలాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవడానికి ప్రయత్నించరు. కాళేశ్వరం ప్రాజెక్టుకో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకో జాతీయ హోదా సాధించేందుకు ప్రయత్నించరు. కృష్ణ, గోదావరి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని కోరరు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని పట్టుబట్టరు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా పోరాటం చేయాల్సింది పోయి, పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై నిందలు వేయడమే పనిగా చేసుకోవడం దుర్మార్గమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్లమెంట్ వేదికగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగలేదని కేంద్రం ప్రకటించిందో, అదే వేదికగా.. అదే కేంద్రం లక్ష కోట్లు కొట్టుకుపోయాయని పేర్కొంటే తప్పుబట్టాల్సిందిపోయి రాష్ట్ర ప్రయోజనాలపై మరోరాయి వేయడానికి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పోటీపడుతున్నారనే ఆగ్రహం వ్యకమవుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ విషం కక్కుతున్నా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం దాల్చారు. గత నెల 10వ తేదీన టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు -2014 ఆమోదం పొందిన రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. 2014 ఫిబ్రవరి 18ని బ్లాక్ డేగా పేర్కొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటాన్ని చీకటిరోజుగా అభివర్ణిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం నోరు మెదపలేదు.
బిల్లుకు, ఆర్డినెన్స్‌కు తేడా తెలియకుండా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పేరుతో కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చిందనే కనీస అవగాహన కూడా మంత్రి కిషన్‌రెడ్డికి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం లభించింది. మార్చి 1, 2014న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. బిల్లులో భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని 7 మండలాలు తెలంగాణ భూభాగంలోనే ఉన్నాయి. అయితే, 2014 మేలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సరార్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర న్యాయశాఖ జులై 17, 2014న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాస్తవాలను విస్మరించి కిషన్‌రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేశారు.
మట్టిపనికైనా ఇంటోడు ఉంటే ఏం ప్రయోజనం కలుగుతుందో ఇటీవల రాజ్యసభలో చోటుచేసుకున్న ఉదంతమే నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసంబద్ధ, అసత్య ఆరోపణలు చేసిన మంత్రి తక్షణమే సభకు క్షమాపణ చెప్పాలని, రికార్డుల నుం చి ఆ వ్యాఖ్యలు తొలగించాలని పట్టుబట్టారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించిన మంత్రి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.