LRS | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ‘ప్రో-రేటా’ విధానంలో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని లెక్కించిన తర్వాతే ఒక్కో ప్లాటు ఓపెన్ స్పేస్ చార్జీలను నిర్ధారించాలి. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఆయా కాలనీల్లో ఎంతోకొంత ఓపెన్ స్పేస్ వినియోగంలో ఉన్నప్పటికీ ఆ మేరకు అందులోని ప్లాట్ల యజమానులకు ఎల్ఆర్ఎస్లో ఆర్థికంగా ఊరట కలగడం లేదు. ఇదేమంటే.. ఆ ప్రదేశాలను తాము అధికారికంగా ధ్రువీకరించడం లేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్లో నిబంధనల ప్రకారం దక్కాల్సిన వేల రూపాయల మినహాయింపునకు సామాన్యుడు నోచుకోవడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే కోట్ల రూపాయల ‘ప్రో-రేటా’ రూపంలో దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం అందడం లేదు.
ఒక లేఅవుట్ చేసినపుడు హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు తీసుకునే క్రమంలో ఆయా సంస్థలు నిబంధనల ప్రకారం పది శాతం విస్తీర్ణాన్ని ప్రజా ప్రయోజనాలకు కేటాయిస్తారు. అందులో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా మైదానాలు, జిమ్‌లు ఇలా కాలనీవాసుల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటారు. కానీ దశాబ్దాల కిందట చేసిన అనధికారిక లేఅవుట్లలో రహదారులు మినహా ఇలాంటి అవసరాల కోసం కేటాయించిన స్థలాలు నామమాత్రమే. ఇవన్నీ గ్రామపంచాయతీ అనుమతులతో చేసిన అనధికారిక లేఅవుట్లు కావడంతోనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద వాటిని క్రమబద్ధీకరిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 31లోగా రూ.3వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 25 శాతం రిబేటును ప్రకటించి చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ఓపెన్ స్పేస్ చార్జీలను ప్రో-రేటా విధానంలో చెల్లించాలనే అంశాన్ని చేర్చింది. కానీ ఇది అమలుకు నోచుకోవడంలేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ఎక్కడా ఈ ప్రో-రేటా విధానాన్ని అమలు చేయడం లేదు. దరఖాస్తుదారుల కాలనీలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రజాప్రయోజనాల స్థలాల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అది అనధికారిక లేఅవుట్ అయినందున కచ్చితంగా 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించాలంటున్నారు. ఎవరైనా తమ కాలనీలో పార్కుగానీ దేవాలయాలకు కేటాయించిన స్థలాలుగానీ కమ్యూనిటీ హాల్ నిర్మించిన ప్రదేశంగానీ ఉందని చెప్పినా వాటిని తాము ధ్రువీకరించలేమని సంబంధిత మున్సిపాలిటి, కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు.
తద్వారా ప్రభుత్వమే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సామాన్యుడు ప్రయోజనం పొందలేకపోతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 25.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఈ ప్రో-రేటా విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు కోట్ల రూపాయల భారం తగ్గనుంది. ముఖ్యంగా ఒక రియల్టర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రతీ సామాన్యుడిపై ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రూపంలో ఆర్థిక భారాన్ని మోపుతున్నది. రియల్టర్ మాత్రం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ ప్రో-రేటా విధానాన్నయినా ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తే సామాన్యులకు ఎంతోకొంత న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నగరంతో పాటు శివారులోని అన్ని అనధికారిక లేఅవుట్లలో పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లు… ఇలా ఎన్నో ప్రజాప్రయోజనకర ప్రదేశాలు ఉన్నాయి. ఇవే కాదు.. ఓ కాలనీలో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కాపాడాం.. మరో కాలనీలో 500 గజాల్లో ఆక్రమణకు గురైన ఓపెన్ స్పేస్‌ను స్వాధీనం చేసుకున్నాం.. అంటూ తరచూ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తారు. వాటిని పరిగణలోకి తీసుకొని, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో కొలిచి, ఎల్ఆర్ఎస్ కోసం వసూలు చేస్తున్న 14 శాతం చార్జీల్లో మినహాయిస్తుందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లేఅవుట్ చేసినపుడు మొత్తం విస్తీర్ణంలో పది శాతం స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలి. ఇది సర్కారు నిబంధన. ఇది అమలు చేయనందునే ప్రభుత్వం వాటిని అనధికారిక లేఅవుట్ల కింద పరిగణిస్తూ అందులోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ (భూ క్రమబద్ధీకరణ పథకం)ను అమలు చేస్తుంది. లేఅవుట్ యజమాని పది శాతం విస్తీర్ణాన్ని వదిలిపెట్టనందుకు అక్కడి మార్కెట్ విలువలో 14 శాతం మొత్తాన్ని ప్లాటు యజమానుల నుంచి వసూలు చేస్తుంది.
ఉదాహరణకు పదెకరాల విస్తీర్ణంలో గ్రామపంచాయతీ అనుమతి తీసుకొని గతంలో లేఅవుట్ చేశారు. నిబంధనల ప్రకారం పది శాతం అంటే ఎకరం (4,840 చదరపు గజాలు) విస్తీర్ణాన్ని ప్రజా ప్రయోజనాలకు వదిలివేయాలి. ఇలా కాకుండా ఒకట్రెండు చోట్ల పార్కుల కోసం 600 చదరపు గజాల చొప్పున స్థలాలను వదిలివేశారనుకుందాం. అంటే 1200 చదరపు గజాల్లో మాత్రమే ఓపెన్ స్పేస్ వదిలివేశారు. నిబంధనలు పది శాతం అని చెబుతుంటే.. ఇక్కడ మాత్రం కేవలం 2.5 శాతం విస్తీర్ణంలో మాత్రమే వదిలిపెట్టారు. ఈ 1200 చదరపు గజాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్వాధీనం చేసుకొని కాలనీవాసుల కోసం వాటిని అభివృద్ధి చేస్తున్నాయి.