Telangana | ఆదిలాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో ఈ ఏడాది 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఎకరానికి సగటు 10 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అహర్నిశలు కష్టపడి సాగుచేసిన పంటను అమ్ముకుందామని ఎన్నో ఆశలతో మార్కెట్‌కు వచ్చిన రైతులకు నిరాశ ఎదురైంది. పంటలో తేమ ఎక్కువ ఉందనే కారణాన్ని చూపుతూ సీసీఐ పత్తిని కొనకపోవడంతో.. ఇదే అవకాశంగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీఐ ద్వారా పంటను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటేనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. పంట ప్రారంభంలో తేమ కొద్దిగా ఎక్కువగా ఉంటుందని తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనాలని రైతులు కోరినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 7521 ప్రకటించగా వ్యాపారులు 8 శాతం తేమతో రూ.7 వేల వరకు కొంటున్నారు. పంటలో తేమశాతం 15 నుంచి 18 వరకు ఉండడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. 15 శాతం తేమ ఉంటే రూ.6510, 16 శాతం ఉంటే రూ.6440 చెల్లిస్తున్నారు. తేమశాతం నిర్ధారణపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నేను ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు ట్రాక్టర్లో 26 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చాను. సీసీఐకి పత్తిని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. పంటలో తేమ ఎక్కువ ఉందని సీసీఐ అధికారులు కొనుగోలుకు నిరాకరించారు. పంటను తిరిగి ఇంటికి తీసుకుపోలేని పరిస్థితులు ఉండగా ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని విక్రయించారు. వాళ్లు క్వింటాల్‌కు రూ.6600 చెల్లించారు. 26 క్వింటాళ్లకు నాకు రూ.25 వేల నష్టం జరిగింది.
– మల్లేశ్, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా
నేను 15 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశా. ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పంటను నాలుగు రోజులు ఎండబెట్టి 22 క్వింటాళ్లు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చా. 15 శాతం తేమ ఉంది తీసుకోబోమని సీసీఐ అధికారులు అన్నారు. మార్కెట్ అధికారులను దగ్గరికి పోయి సమస్య తెలిపినా వాళ్లు ఏమి చేయలేమని చెప్పారు. చేసేదేమీ లేక తక్కువ ధరతో ప్రైవేట్ వ్యాపారులకు పంటను అమ్ముకోవాల్సి వచ్చింది.
– హన్మాండ్లు, లేఖర్వాడ, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా